తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి
ABN , First Publish Date - 2021-05-21T04:21:34+05:30 IST
మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అంతరాయం దృష్ట్యా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని

- మిషన్ భగీరథ నీటి సరఫరా అంతరాయంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి
- రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పాత ప్రాజెక్టులు, పైప్‌లైన్లద్వారా ఏర్పాట్లు
- సమీక్షా సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అంతరాయం దృష్ట్యా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యామ్నా యాలపై దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. గురువారం నగరంలోని తన నివాసంలో అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీశైలం నుంచి వచ్చే నీటి సరఫరాలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్ల మరమ్మతుల కార ణంగా ఈనెల 24 నుంచి నీటి సరఫరా నిలిపి వేయబడుతుం దన్నారు. మరమ్మతుల పనులు పూర్తయ్యేవరకు సుమారు 30 రోజులు పట్టే అవకాశం ఉన్నందున రంగారెడ్డి జిల్లాలో 1,064 గ్రామాలు, వికారాబాద్ జిల్లాలో 976 గ్రామాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ అధికారులు నీటి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని సర్పంచ్‌లు, కార్యద ర్శులు, మున్సిపాలిటీలలో చైర్మన్లు, కమిషనర్లు పాత పద్ధతిలో అందు బాటులో ఉన్న తాగునీటి బోర్లు, వనరుల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బోర్లకు నిరంతర కరెంట్ అందేలా విద్యుత్ అధికారులు చొరవ చూపాలన్నారు. సింగిల్ ఫేజ్ బోర్లు స్కీం వాడుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూర్ మండలం పరిధిలోని గ్రామాలకు గున్గల్ నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా నీటి సరఫరా కు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. గున్గల్ నుంచి ఇప్పటికే ఇబ్రహీంపట్నంలోని 133 గ్రామాలకు, మున్సిపాలిటీకి నీటి సరఫరా జరుగుతుందన్నారు. అవకాశంఉన్న మేరకు పాత లైన్‌కు మరమ్మ తులు చేసి మరిన్ని గ్రామాలకు నీరు వచ్చేలా చూడాలన్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ, మొయినాబాద్ మండలంలోని 40 గ్రామాలు, శంకర్‌పల్లి మున్సిపాలిటీకి, సింగపూర్ రిజర్వాయర్ ద్వారా పాత మంజీరా పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను చేపట్టాలని సూచించారు. దీంతోపాటు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో 216 గ్రామాలకు, తాండూర్ మున్సిపాలిటీకి కాగ్నా నది ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి ఆదేశించారు. పరిగి, వికారా బాద్ నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈఈలు రాజేశ్వర్, నర్సింలుగౌడ్, డీఈ ప్రియాంక తదితరులు ఉన్నారు.