విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు..!

ABN , First Publish Date - 2021-05-05T05:51:54+05:30 IST

విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు..!

విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు..!
కిరాణషాపులో అమ్ముతున్న మద్యం

  •  ఊరూరా ఆటోల ద్వారా సరఫరా 
  •  ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు
  •  చోద్యం చూస్తున్న అబ్కారీ శాఖ అధికారులు

పరిగి: వికారాబాద్‌ జిల్లాలో మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కిరాణ షాపుల్లోనే నిత్యవసర సరుకుల మాదిరిగా మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. అధికారులు మాత్రం బెల్టుషాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదు వరకు మద్యం బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. ఈ విషయం ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లు ఉంటున్నారు. నామమాత్రంగా అప్పుడప్పుడు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ రేటుకు మద్యం అమ్ముతున్నప్పటికీ బెల్లు షాపుల్లో మాత్రం రేట్లను 10 నుంచి 20 శాతం పెంచి విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 45 మద్యం షాపులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 565 పంచాయితీలు, 501 రెవెన్యూ గ్రామాల్లో దాదాపుగా వెయ్యికిపైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు గతంలో ఏ మండలంలో ఎంత మంది బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో గుర్తించి బైండోవర్‌ చేశారు. ప్రతి మండలానికి 25 నుంచి 35 మంది చొప్పున బైండోవర్‌ చేశారు. ఆ తర్వాత మద్యం బెల్టు షాపుల విషయాన్ని మరిచిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే గ్రామాల్లో మద్యం ధరలను మాత్రం ఇష్టారాజ్యంగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు తప్పని పరిస్థితుల్లో  ధర ఎంతైనా కొనుగోలు చేసుకొని సేవించాల్సిన దుస్థితి నెలకొంది. అసలే పెరిగిన రేట్లతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతుంటే బెల్టు షాపుల్లో రేట్లు పెంచడంతో తప్పని పరిస్థితుల్లో కొనాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. కాగా డిమాండ్‌ను బట్టి  వ్యాపారస్తులు బీర్లు, విస్కీలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. జిల్లాలోని అక్కడడక్కడా కొన్ని దుకాణాల్లో బీర్లు, వీస్కీ ధరలను ఒక రూపాయి పెంచి అమ్ముతున్నారు. షాపులు దక్కించుకునేందుకు పోటీపడి టెండర్‌లో అధిక మొత్తానికి కైవసం చేసుకున్న వ్యాపారులు కొన్నిచోట్ల ‘సిండికేట్‌’నే నడిపిస్తున్నారు. మద్యం వ్యాపారులు మద్యం ప్రియులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. 

  • ఊరూరా సరఫరా.. లక్షల్లో సంపాదన

వైన్‌ షాపుల యజమానులు ఆటోల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. టెండర్‌లో ఎక్కువ ధరకు షాపులను దక్కించుకున్న వ్యాపారస్తులు మద్యాన్ని ఊరూరా సరఫరా చేసి లాభాలు గడించేందుకు యత్నిస్తున్నారు. దోమ, కులకచర్ల, బొంరాసిపేట్‌, దౌల్తాబాద్‌, యాలాల్‌, పేద్దేముల్‌, కొడంగల్‌ తదితర మండలాల్లోని షాపుల యజమానులు నిత్యం ఆటోల ద్వారా ఊరూరా తిగిరి అమ్ముతున్నారు. కేవలం ఒక షాపు ద్వారానే రెండు నుంచి మూడు లక్షకుపైగా అమ్మకాలు జరుపుతున్నారు. వీరంతా గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇకపోతే బెల్టు షాపుల యజమానులు ఒక్కో బీరు, విస్కీ క్వార్టర్‌ సీసా మీద రూ.10 నుంచి రూ.20ల వరకు అధికంగా విక్రయిస్తున్నారు. వ్యాపారులు కిరాణ షాపుల్లో చిల్లర వస్తువుల్లా అమ్మకాలు జరుతున్నారు. 

  • గ్రామాల్లో మందుబాబుల గొడవలు

గ్రామాల్లో విరివిగా బెల్టుషాపులు ఉండడంతో గొడవలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల పరిగి మండలం రాపోల్‌ గ్రామంలోని బెల్టుషాపు దగ్గర గొడవను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. షాపులు అందుబాటులో ఉండడంతో మద్యం ప్రియులకు తాగడానికి దూరం వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. దీంతో షాపుల్లో ఖాతాలు పెట్టి మరీ తాగుడుకు బానిస అవుతున్నారు.

  • బెల్టుషాపుల నుంచి డబ్బులు వసూలు

జిల్లాలోని అనేక గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టుషాపుల యజమానుల దగ్గర నుంచి ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా బెల్టుషాపును నిర్వహించకూడదు. అయితే ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నా, కిందిస్థాయి సిబ్బంది మాత్రం నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతుతున్నాయి. ఎక్సైజ్‌ అధికారులు కాకుండా గతంలో జిల్లాలో పోలీస్‌ శాఖ ప్రతి గ్రామంలో ఎన్ని బెల్టు షాపులు ఉన్నాయో గుర్తించింది. అయితే జిల్లాలోని కొన్ని మండలాల్లో పోలీసు అధికారులు కూడా నెలవారీగా మామూళ్ళు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగానే వ్యక్తం అవుతున్నాయి. ఇలా కొన్ని మండలాల్లో నెలకు లక్షకుపైగా బెల్టుషాపుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులను అటుంచితే ఇటీవల పరిగి సర్కిల్‌ పరిధిలోని ఎక్సైజ్‌ అధికారులు భారీఎత్తున వసూలు చేస్తున్నారు. పరిగి ఎక్సైజ్‌ అధికారులు గ్రామాలను సందర్శించి, బెల్టు షాపుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2021-05-05T05:51:54+05:30 IST