కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం

ABN , First Publish Date - 2021-05-03T04:44:45+05:30 IST

కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం

కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం
కులకచర్లలో మైత్రీ యువజన సంఘం ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

కులకచర్ల: కరోనా మహమ్మారి నుంచి ధైర్యంగా ఎదుర్కొందామని పలు సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఈ సందర్భంగా కరోనా బాధితులకు అండగా ఉంటున్నాయి. కులకచర్ల గ్రామ పరిధిలో కరోనాబారిన పడిన కుటుంబాలకు ఆదివారం మైత్రీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. ఆ సంఘం అధ్యక్షుడు చెన్నయ్య తన సొంత డబ్బులతో సరుకులనుపంపిణీ చేశారు. స్థానికులు చంద్రలింగం, వెంకటయ్య, మైపాల్‌, రమేశ్‌, సురేష్‌, పెంటయ్య పాల్గొన్నారు.

కొనసాగుతున్న లాక్‌డౌన్‌ 

కులకచర్లలో లాక్‌డౌన్‌ యథావిధిగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం 12గంటల లోపే షాపులు, దుకాణాలు, హోటళ్లు అన్నీ మూసివేస్తున్నారు. ప్రస్తుతం షాపులు తెరుస్తున్న సమయం సరిపోవడం లేదని, మరింత సమయం కేటాయించేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆలోచించాలని వ్యాపారస్థులు కోరుతున్నారు. 

ఐనాపూర్‌లో మాస్కులు పంపిణీ 

దోమ: మండలంలోని ఐనాపూర్‌లో ఆదివారం సర్పంచ్‌ మల్లేశ్‌, ముస్లిం యువకులు కొవిడ్‌-19పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అదే విధంగా మాస్కులు, జింక్‌ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బుగ్గయ్య, నాయకులు సిద్దిరాములు, రాహూప్‌, గౌస్‌, ఖధీర్‌, యాదయ్య, మల్లేశ్‌, రవి పాల్గొన్నారు.

మరో ఎనిమిది రోజులు ఆలయ ప్రవేశం నిలిపివేత

వికారాబాద్‌: కరోనా రెండవ దశ కారణంగా అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ పద్మనాభ స్వామి ఆలయంలో మరో ఎనిమిది రోజులు భక్తులకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఫౌండర్‌ సభ్యుడు పద్మనాభం, ఈవో శేఖర్‌గౌడ్‌లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్‌ విజృంభిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


జిల్లాలో 166 మందికి పాజిటివ్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): జిల్లాలో ఆదివారం 732 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 166 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాండూరులో 35, పరిగిలో 32, కొడంగల్‌లో 24, మర్పల్లిలో 18, బషీరాబాద్‌లో 11, రామయ్యగూడలో 13, జిన్‌గుర్తిలో ఎనిమిది, నవాల్గలో ఆరు, మోమిన్‌నేట్‌లో నాలుగు, యాలాల్‌, కులకచర్ల, నవాబ్‌పేట్‌, కోట్‌పల్లిలో మూడు చొప్పున, దౌల్తాబాద్‌లో రెండు, ధారూరులో ఒక  కరోనా కేసులు నమోదయ్యాయి. కిట్ల కొరత కారణంగా దోమ, పెద్దేముల్‌, నాగసమందర్‌ పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయలేదు. 

కరోనాతో ఇద్దరు మహిళలు మృతి 

జిల్లాలో కరోనాకు ఆదివారం మరో ఇద్దరు మహిళలు బలయ్యారు. పెద్దేముల్‌ మండలం, నాగులపల్లిలో ఓ మహిళ (70), తాండూరు మండలం, కరన్‌కోట్‌లో మరో మహిళ(35) మృతి చెందారు. 

కరోనా మృతులకు స్వచ్ఛంద సంస్థల చేయూత

పెద్దేముల్‌/తాండూరు రూరల్‌: మండలంలోని నాగులపల్లి గ్రామంలో ఓ మహిళ కరోనాతో మృతి చెందగా అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ముస్లిం యూత్‌ వెల్ఫేర్‌, మహాసేవ స్వచ్ఛంద సంస్థల సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. అదేవిధంగా తాండూరు మండలం కరన్‌కోట్‌లో ఓ యువతి(35) కరోనాతో మృతిచెందగా దహన సంస్కారాలు నిర్వహించారు. 

పరిగిలో 35మందికి కరోనా పాజిటివ్‌

పరిగి: పరిగి సబ్‌డివిజన్‌లో ఆదివారం 35మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పరిగి, కులకచర్ల, పూడూరు మండలాల్లో 175 మందికి పరీక్షలు చేయగా 35 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరిగిలో 80మందికి గానూ 32మందికి, కులకచర్లలో 25మందిలో ముగ్గురికి, పూడూరులో 70మందికి పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. దోమలో కిట్లులేని కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. అన్ని మండలాల్లో కొవిడ్‌ కిట్ల కొరత కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడంతో జనం పడిగాపులు కాసి వెనుతిరిగిపోయారు. 

ధారూరు పీహెచ్‌సీలో ఒకరికి..

ధారూరు: ధారూరు పీహెచ్‌సీలో ఆదివారం 35మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఒకరికి కరోనా పాజటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి రాజు తెలిపారు.

Updated Date - 2021-05-03T04:44:45+05:30 IST