ఇంకెన్ని రోజులు?

ABN , First Publish Date - 2021-03-25T05:13:17+05:30 IST

కొత్త రేషన్‌ కార్డుల కోసం నిరుపేదలు ఎదురుచూస్తున్నారు.

ఇంకెన్ని రోజులు?

  • కొత్త ఆహార భద్రత కార్డుల కోసం ఎదురుచూపులు
  • కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
  • కార్డులు అందక నిరాశలో లబ్ధిదారులు


కొత్త రేషన్‌ కార్డుల కోసం నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. ఆన్‌లైన్‌లో కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త కార్డు కూడా జారీ కాలేదు. దరఖాస్తులపై కదలిక లేకపోవడంతో ఎప్పుడు జారీ చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అసలు ఇస్తరో.. ఇవ్వరో తెలియని పరిస్థితి నెలకొంది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) /(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : కొత్తగా ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా కార్డుల జారీపై కదలిక లేకపోవడంతో ఎప్పుడు జారీ చేస్తారో తెలియక ఆశావహులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఆహారభద్రతా కార్డులు ఎప్పుడు జారీచేస్తారో తెలియక దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. జారీ చేసే విషయమై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులకు మరికొంత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నెలనెలా బియ్యం, కిరోసిన్‌, చక్కెర, ఉప్పు సరఫరా చేస్తోంది.  

2019, ఆగస్టు నెల వరకు కొత్త ఆహార భద్రతా కార్డులు జారీచేసిన ప్రభుత్వం ఆ తరువాత జిల్లాకు కొత్త కార్డులు మంజూరు చేయలేదు. కొత్త ఆహార భద్రతాకార్డుల కోసం మండల తహసీల్దార్‌ కార్యాలయాలకు కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. కొత్త కార్డులు ఎప్పుడు జారీ చేస్తారో తెలియక దరఖాస్తుదారులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆహార భద్రత కార్డులు రేషన్‌ సరుకులు పొందడానికి మాత్రమే ఉపయోగపడతాయనేది ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా ఆదాయం, ఇతర సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో సంబంధిత అధికారులు ఈ కార్డులను ఓ ఆధారంగా పరిగణిస్తున్నారు. తాము దారిద్ర రేఖకు దిగువన ఉన్నట్లు ధృవీకరించుకోవడానికి పలువురు లబ్దిదారులు ఈ ఆహార భద్రతా కార్డులను ఆధారంగా ఉపయోగించుకుంటున్నారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వారి భార్యలు, పిల్లలు అందరిని కలిసి ఉమ్మడి కుటుంబంగా భావిస్తే, భార్యాభర్తలు, వారి పిల్లలను కలిసి చిన్న కుటుంబంగా పరిగణిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి పేర్లు ఇది వరకే ఆహార భద్రతా కార్డులో పేరు నమోదై ఉంటే, దాంట్లో నుంచి తమ పేర్లను తొలగించుకోవాల్సి ఉంటుంది. తమ పేర్లు ఉన్న కార్డుతో పాటు ఆ తరువాత తమ పేర్లు తొలగించుకున్న కార్డు ప్రతులతో కొత్తగా వివాహమైన వారు, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారు కొత్త ఆహార భద్రతా కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతకు ముందు వారి వివరాలు ఉన్న కార్డులకు బియ్యం వచ్చేవి. పాత కార్డులో తమ వివరాలు తొలగించుకుని కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవడంతో నెలనెలా వచ్చే బియ్యం కాస్తా నిలిచిపోయాయి. అటు కొత్త కార్డులు జారీ కాక, ఇటు నెల నెలా వచ్చే బియ్యం రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 


పెండింగ్‌లో దరఖాస్తులు

కొత్త ఆహార భద్రతా కార్డుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా పంపించిన దరఖాస్తులు పరిశీలనకు నోచుకోవడం లేదు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచారణ జరపాల్సిన సిబ్బంది ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో వచ్చిన దరఖాస్తులు వచ్చినట్లుగానే మిగిలిపోతున్నాయి. 


రంగారెడ్డి జిల్లా రేషన్‌ కార్డుల వివరాలు

దరఖాస్తులు : 1,41,970

ఇన్‌స్పెక్టర్‌ వద్ద పెండింగ్‌ : 66,624

తహసీల్దారు వద్ద పెండింగ్‌ : 3,575

డీఎస్‌వో వద్ద పెండింగ్‌ : 32,636

ఆమోదించినవి  : 30,741


వికారాబాద్‌  జిల్లాలో..

దరఖాస్తులు : 12,150 

ఆమోదించినవి  :  4,547 

పెండింగ్‌ దరఖాస్తులు  :  7,603


రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో ఉన్న రేషన్‌ కార్డుల వివరాలు

రేషన్‌ దుకాణాలు : 1,507

ఆహార భద్రతా కార్డులు  697824

అంత్యోదయ కార్డులు 61898

అన్నపూర్ణ కార్డులు 81


Updated Date - 2021-03-25T05:13:17+05:30 IST