గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2021-11-29T05:15:46+05:30 IST

భూములకు విలువ పెరగడంతో అక్రమార్కులు సీలింగ్‌ భూములపై కన్నేశారు. పదో పరుకకు తీసుకున్న భూముల విలువ నేడు రూ.కోట్లకు చేరింది. మేడ్చల్‌ జిల్లా కీసర మండల కేంద్రంలో 22 ఎకరాల సీలింగ్‌ భూమి రియల్‌ వెంచర్‌గా మారింది.

గోల్‌మాల్‌
కీసరలో వివాదస్పద స్థలం

 • సీలింగ్‌ భూముల్లో వెంచర్లు
 • రూ.100కోట్ల విలువైన సీలింగ్‌ భూమిలో వెంచర్‌
 • 22 ఎకరాలు పరాధీనం!
 • రెవెన్యూ అధికారులు, అక్రమార్కుల కుమ్మక్కు
 • 250 మంది ప్లాట్లు గల్లంతు
 • కీసరలో సీలింగ్‌ భూబాగోతం

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండల కేంద్రంలో 184, 185, 186, 196 సర్వే నెంబర్లలో 22ఎకరాల సీలింగ్‌ ల్యాండ్‌ ఉంది. ఈ భూమిలో కీసర గ్రామానికి చెందిన 16 మంది లబ్ధిదారులు 38-ఈ-సర్టిఫికెట్లతో కొంత కాలం కాస్తులో ఉన్నారు. 1984లో ఈ భూమిని ఆ 16 మంది కలిసి పూడ్రు రామయ్య, శీలం రామయ్యలకు జీపీఏ చేశారు. అనంతరం వారు సుదర్శన్‌రెడ్డి, ప్రకా్‌షగౌడ్‌, శీలం భూమయ్య, కర్రె బాలయ్యకు జీపీఏ చేశారు. ఈ నలుగురూ ఆ భూమిని 1985లో వెంచర్‌ చేశారు. గాంధీనగర్‌ కాలనీ పేరుతో వెలసిన ఈ వెంచర్‌లో 250మంది ప్లాట్లు కొన్నారు. ఆ సమయంలో గజం రూ.80నుంచి వంద రూపాయలు వరకు ఉండేది. అయితే ఈ వెంచర్‌ సీలింగ్‌ భూమి అని, చట్టవిరుద్ధంగా వెంచర్‌ చేశారని స్థానికులు కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సదరు వ్యక్తులపై పేరుమీదున్న ఉన్న జీపీఏను రద్దు చేసింది.


 • ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చడంతో...

సర్వే నెంబరు 185లోని 9.38ఎకరాలను రెవెన్యూ అధికారులు సీతారాం రాందేవ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులకు ఏదో రకంగా పట్టా చేశారు. దీంతో ఈ భూమిపై జీపీఏ పొందిన వారు వెంచర్‌ చేశారు. అలాగే సర్వే నెంబర్లు 184, 185, 186, 196లోని  22ఎకరాల సీలింగ్‌ భూమిలో 250మంది ప్లాట్లను కొన్నారు. ఈ క్రమంలో సీలింగ్‌ భూముల్లో వెంచర్లు చేయడం, జీపీఏను రద్దుకు ఫిర్యాదుల మేరకు అధికారులు వెంచర్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో 37ఏళ్ల కింద ప్లాట్లు కొన్న వారు తమ ప్లాట్లు దక్కుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్లాట్లను వీటి చుట్టు పక్క వెంచర్‌ యజమానులు ఆక్రమించుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. 250 ప్లాట్లలో సగం 185సర్వేనెంబర్లోని 9.38ఎకరాల వెంచర్‌లోనే ఉన్నాయంటున్నారు. మిగిలిన ప్లాట్లు ఇతర వెంచర్ల నిర్వాహకులు కలిపేసుకున్నారని పేర్కొంటున్నారు.


 • పనులను అడ్డుకుంటున్న ఓనర్లు

సర్వేనెంబరు 185లోని 9.38ఎకరాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వెంచర్‌లో తమ ప్లాట్లు ఉన్నాయని పాత ఓనర్లు పనులను అడ్డుకున్నారు. తమ ప్లాట్లను ఆక్రమించకుంటున్నారని రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ విష్ణు, మరికొందరు పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క నాలుగు సర్వే నెంబర్లలో ఉన్న సీలింగ్‌ భూమిపై హక్కులు కల్పించాలని, తమకు ఉన్న 38-ఈ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆ భూమి తమకే చెందుతుందని మరికొందరు కోర్టుకు వెళ్లారు. 2020 జూన్‌ 19న ఈ భూమిపై కోర్టు స్టేట్‌సకో ఇచ్చింది. అదేమీ పట్టించుకోకుండా 185సర్వే నెంబర్‌లో జీపీఏ పొందిన చుట్టూ ప్రహరీ కట్టి వెంచర్‌ పనులు చేస్తున్నారు. అసలు సీలింగ్‌ భూమి ఇతరుల పేరుపై ఎలా అయ్యింది? 185 సర్వే నెంబర్లోని 9.38ఎకరాలు పట్టాగా ఎవరు.. ఎలా మార్చారనేది మిస్టరీగా మారింది. ఇవే అంశాలపై అధికారులు విచారణ చేస్తే ఆక్రమణదారులు ఎవరనేది తేలుతుందని బాధితులు అంటున్నారు.


 • సీలింగ్‌ సర్వే నెంబరులో ప్రభుత్వ భూమి

కీసరలో సీలింగ్‌ కింద మొత్తం 89 ఎకరాల భూమి రికార్డుల్లో ఉంది. కాగా, 184, 185, 186, 196  సర్వే నెంబర్లలో 22 ఎకరాల భూమి ఉంది. అయితే, ఈసర్వే నెంబర్లలోని 185లో సీలింగ్‌ భూమితోపాటు మరో 9.38 ఎకరాలు  పహాణిలో ప్రభుత్వ భూమి ఉంది. ప్రొహిబిటెడ్‌ ల్యాండ్‌గా ఉంటూ వస్తున్న 9.38 ఎకరాల భూమి 1987లో సీతారాం రాందేవ్‌, విజయకుమార్‌, సీతాదేవి, కృష్ణమూర్తి పేరున రికార్డుల్లో ఎక్కింది. కాగా, ప్రభుత్వ భూమిగా ఉన్న 9.38 ఎకరాల భూమి వీరి పేరున ఎలా మారింది అనే  వివరాలు రెవెన్యూ అధికారులు బహిర్గతం చేయడం లేదు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే.. అప్పుడు ఏమి జరిగిందో మాకు తెలియదని, కీసరలో ఇదొక్కటే భూమి కాదు, అన్నిభూములు వివాదాల్లో ఉన్నాయని కీసరతహసీల్దార్‌ గౌరివత్సల చెబుతున్నారు. సర్వేనెంబర్‌ 185లోని 9.38 ఎకరాల భూమిని సీతారాంరాందేవ్‌తోపాటు ఇతరులు గోవింద్‌ అగ్రవాల్‌, భానుచందర్‌ అనే వ్యక్తులకు జీపీఏ చేశారు. వీరు ఆ భూమిని వెంచర్‌చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 232/2020 పేరుతో హెచ్‌ఎండీఏ వెంచర్‌ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది.


 • అయ్యప్ప నగర్‌లో 22 ప్లాట్లు గోవింద..!

ఘట్‌కేసర్‌ : రెవెన్యూ అధికారులు కక్కుర్తితో ఎప్పుడో చేసిన లేఅవుట్‌కు తిరిగి పట్టాపాస్‌ బుక్‌లు జారీచేయడంతోనే ప్లాట్ల కొనుగోలుదారులు మోసపోతున్నారు. ఘట్‌కేసర్‌లోని సర్వేనెంబర్‌ 552లోని 13ఎకరాల 36గుంటల సాగు భూమిని 1987లో లేఅవుట్‌ చేశారు. అయ్యప్పనగర్‌ కాలనీ పేరుతో  ఇందులో 99 ప్లాట్లు చేసి అమ్మేశారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని బొక్కోనిగూడకు చెందిన కట్ట అచ్చిరెడ్డి, కట్ట ధర్మారెడ్డి, కట్ట నర్సిరెడ్డి, కట్ట మల్లారెడ్డి, కట్ట లక్ష్మారెడ్డి, కట్ట వెంకట్‌రెడ్డి తదితర 12 మంది రైతులు తమ భూమిని 1987 మార్చి 27న కేపీ జగన్నాథంకు జీపీఏ చేశారు. 2018లో రెవెన్యూ అధికారులు అదే భూమిలో కట్ట ధర్మారెడ్డికి ఎకరా 14గుంటల పట్టాదారు పాస్‌బుక్కులు ఇచ్చారు. దీంతో ధర్మారెడ్డి ఆ భూమిని తిరిగి ఓ రియల్టర్‌కు విక్రయించాడు. కొన్న రియల్టర్‌ లేఅవుట్‌ కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేశాడు. ఆ భూమిని చదును చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టాడు. ఇందులో 22ప్లాట్లు ఉన్నాయి. 13ఎకరాల 36 గుంటల భూమిలో ఎలాంటి పార్టేషన్‌ లేకుండానే ధర్మారెడ్డి దగ్గర కొన్న వ్యక్తి తన భూమి ఇక్కడే ఉందని ఎలా ఆక్రమిస్తాడని ప్లాట్ల ఓనర్లు అంటున్నారు. ఓ ప్లాటు యజమాని తన ప్లాటును కాపాడుకునే క్రమంలో కొంత ప్రహరీని ధ్వంసం చేశాడు. దీంతో రియల్టర్‌ ఫిర్యాదుతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ప్లాట్‌ను ఆక్రమించిన వ్యక్తిని వదిలేసి తనపైనే కేసు ఎలా పెడతారని ప్లాటు యజమాని ఫిర్యాదుతో రియల్టర్‌పైనా కేసు నమోదు చేశారు. పోలీసుల అండదండలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రూటు మార్చి తన ప్లాటు డాక్యుమెంట్లు ఇస్తే రూ.2లక్షలు ఇస్తానంటున్నాడని, వినకుంటే  ఏమి చేసుకుంటారో చేస్కోండని బెదిరిస్తున్నాడని ప్లాటు ఓనర్‌ ఆరోపించారు. తమకు ప్లాట్లపై హక్కు లేకుంటే డబ్బులు ఇస్తానని ఎందుకంటున్నాడని ప్లాట్ల ఓనర్లు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా ప్లాట్లను ఆక్రమించి రీ లేఅవుట్‌ చేస్తున్నారని మున్సిపల్‌ కమిషనర్‌కు  ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా అక్రమార్కుల కొమ్ముకాస్తున్నరని ప్లాట్ల ఓనర్లు ఆరోపించారు.


 • కబ్జాదారుల నుంచి స్థలాన్ని కాపాడండి 

కీసర పట్టణంలో మా ప్లాట్లను భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారు. కలెక్టర్‌తోపాటు అధికారులందరికీ ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.  మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో నా ఫిర్యాదుపై ఎవరూ స్పందించడం లేదు. 184, 185, 186, 196 సర్వే నెంబర్లలోని మా ప్లాట్లను కలుపుకొని 9.38 ఎకరాల్లో వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారు. నాతోపాటు 250 మందికి ప్రభుత్వం, అధికారులు న్యాయం చేయాలి.

-విష్ణుమూర్తి, ప్లాటు ఓనర్‌


 •  వ్యవసాయేతర భూములుగా మార్చలేదు

వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే కొందరు లే అవుట్లు చేసి విక్రయిస్తున్నారు. దీంతో  రెవెన్యూ రికార్డుల్లో నేటికీ అవి పట్టాదారుల పేర్లపైనే వస్తున్నాయి. దీంతో తిరిగి అమ్మకాలు చేస్తున్నారు. ఘట్‌కేసర్‌లోని  సర్వే నెంబర్‌ 552లోని భూమికి 2018లోనే ధర్మారెడ్డి అనే వ్యక్తికి పట్టా పాస్‌బుక్కులు జారీ అయ్యాయి.

 - విజయలక్ష్మి, తహసీల్దార్‌, ఘట్‌కేసర్‌


 • పార్కు స్థలం మున్సిపల్‌ ఆధీనంలోనే ఉంది

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్‌ 552లోగల భూమిలో తమ ప్లాట్లు అక్రమించి ప్లాట్లు చేస్తున్నారని ఇప్పటివరకు ఏడు ఫిర్యాదులు వచ్చాయి.  అయ్యప్పనగర్‌ లేఆవుట్‌లోని పార్కు స్థలం మున్సిపాలిటీ ఆధీనంలో ఉంది.  దానిని సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందులో కొంత భూమిలో చేస్తున్న లేఆవుట్‌ అంశం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నది.

- వసంత, మున్సిపల్‌ కమిషనర్‌, ఘట్‌కేసర్‌ 


 • నా ప్లాట్ల చుట్టూ ప్రహరీ నిర్మించారు

నేను 2003లో అయ్యప్పనగర్‌లో రెండు ప్లాట్లు కొనుగోలు చేశాను. భవిష్యత్‌ అవసరాల కోసం కష్టపడి ప్లాట్లు కొంటే ఇప్పుడు దాదాపు ఎకరన్నర స్థలంలో ఉన్న ప్లాట్ల చుట్టూ ప్రహరీ నిర్మించారు. అందులోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మునిసిపల్‌ కమిషనర్‌, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాం.

- పెంజర్ల నాగమణి ప్లాట్ల ఓనర్‌, ఉప్పల్‌

Updated Date - 2021-11-29T05:15:46+05:30 IST