చిక్కిన లక్కు!

ABN , First Publish Date - 2021-11-21T05:36:25+05:30 IST

చిక్కిన లక్కు!

చిక్కిన లక్కు!
మద్యం దుకాణాలకు డ్రా తీస్తున్న రాహుల్‌ బొజ్జా

  • మద్యం దుకాణాల లక్కీ డ్రా పూర్తి 
  • వ్యాపారులను వరించిన అదృష్టం
  • జన జాతరను తలపించిన ఇండోర్‌ స్టేడియం
  • కొవిడ్‌ నిబంధనలు గాలికి..
  • జిల్లాలో 234 దుకాణాలకు డ్రా
  • డిసెంబర్‌1 నుంచి కొత్త మద్యం పాలసీ

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): మద్యం టెండర్లకు లక్కీ డ్రా ఉత్కంఠ భరితంగా సాగింది. మద్యం దుకాణాలకు టెండర్లు వేసిన వారంతా వారు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒక్కో దుకాణానికి సిండికేట్‌గా 20-30 వరకు టెండర్లు వేసి దుకాణాలను దక్కించుకున్నారు. శనివారం సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను ఎంపిక చేశారు. స్టేడియం మొత్తం జనజాతరను తలపించింది. ఎక్కడ చూసినా మద్యం టెండర్‌దారులే కనిపించారు. మహిళలు చంటి పిల్లలను ఎత్తుకుని లక్కీ డ్రాలో పాల్గొనేందుకు వచ్చారు. సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ డివిజన్‌కు సంబంధించి 134 దుకాణాలకు జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ డ్రా తీశారు. శంషాబాద్‌ ఎక్సైజ్‌ డివిజన్‌కు సంబంధించి షెడ్యూల్‌ కులాల అభివృద్ధిశాఖ ప్రభుత్వ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా లాటరీ ద్వారా 100 మద్యం దుకాణాలను ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 234 మద్యం దుకాణాలకు గాను 8,239 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత లాటరీ ద్వారా 234 దుకాణాలను ఎంపిక చేశారు. ఇందులో ఎస్టీలకు8, ఎస్సీలకు 11, గౌడ కులస్తులకు 34, జనరల్‌కు 181 మద్యం దుకాణాలను కేటాయించారు. డ్రాలో షాపులు దక్కించుకున్న వారు 2021 డిసెంబర్‌ 1 నుంచి 2023 డిసెంబర్‌ 30 వరకు షాపులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించే సుంకం గతంలో నాలుగుసార్లు చెల్లించాల్సి ఉండగా, ఈసారి ఆరుసార్లు చెల్లించేలా వీలు కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రఘునాథ్‌, శంషాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జనార్దన్‌రెడ్డి, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

కొవిడ్‌ నిబంధనలు గాలికి..

కొవిడ్‌ నిబందనలు గాలికి వదిలేశారు. భౌతికదూరం పాటించలేరు. దగ్గర దగ్గర కూర్చున్నారు. చాలామంది మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరిగారు. 


  • ఈసారి కలిసి వచ్చింది..

శంషాబాద్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ పరిధిలోని మణికొండ గజిట్‌ నెంబర్‌ 63, షాప్‌నెంబర్‌ 3కు అత్యధికంగా 94 దరఖాస్తులు వచ్చాయి. లక్కీ డ్రా మాత్రం రమేష్‌ కుమార్‌ను వరించింది. ఇదే మద్యం దుకాణం దక్కించుకునేందుకు అతను గతంలో రెండుసార్లు ప్రయత్నించినా రాలేదని, ఈ సారి తనకు అదృష్టం కలిసివచ్చిందని తెలిపారు.

-రమే్‌షకుమార్‌, మద్యం వ్యాపారి 


వరుసగా రెండు...

శంషాబాద్‌ ఎక్పైజ్‌ డివిజన్‌ పరిధిలో ఉదయం 11 గంటలకు లక్కీ ప్రారంభమైంది. షెడ్యూల్‌ కులాల అభివృద్ధిశాఖ ప్రభుత్వ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా లాటరీ ద్వారా మొదటి డ్రా తీశారు. శేరిలింగంపల్లి పరిధిలోని కొండాపూర్‌లో రెండు షాపులకు ఒకటి తర్వాత మరొకటి వ్యాపారి రాములుగౌడ్‌ను వరించింది.

-రాములుగౌడ్‌ 

Updated Date - 2021-11-21T05:36:25+05:30 IST