చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుకు కేసీఆర్‌ తూట్లు

ABN , First Publish Date - 2021-10-22T05:15:52+05:30 IST

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర రెండో రోజూ విజయవంతంగా సాగింది.

చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుకు కేసీఆర్‌ తూట్లు
పాదయాత్రలో ప్రజలను పలకరిస్తూ.. కాచారంలో మహిళలను అక్కున చేర్చుకున్న షర్మిల

  • ప్రజలు ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తా  
  • వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
  • షర్మిలకు సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు 
  • రెండోరోజూ ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతం 


వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర రెండో రోజూ విజయవంతంగా సాగింది. అడుగడుగునా జనాన్ని పలకరిస్తూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. 12కిలోమీటర్లు సాగిన యాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు షర్మిల వెంట నడిచారు. గ్రామగ్రామాన ఆమెకు జనం నీరాజనం పలికారు. రైతులు, మహిళలు తమ సమస్యలను షర్మిలకు ఏకరువు పెట్టుకున్నారు. రాజన్న రాజ్యం తీసుకురావడానికి తాను ప్రజల్లోకి వచ్చానని, అధికారంలోకి వస్తే సమస్యలు తీర్చి ప్రజలకు అండగా ఉంటానని ఈసందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.


చేవెళ్ళ/ మొయినాబాద్‌/మొయిబానాబాద్‌ రూరల్‌/ షాబాద్‌/పరిగి/ శంషాబాద్‌ రూరల్‌ : ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రజలు ఎన్నో కలలు కన్న చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టుకు సీఎం కేసీ ఆర్‌ తూట్లు పొడిచి ఈ ప్రాంత ప్రజలను వంచించారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల విమర్శించారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర రెండోరోజు గురువారం శంషాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లో సాగింది. శంషాబాద్‌ మండలంలోని మల్కారంలో మాటముచ్చట కార్యక్రమం నిర్వహించారు. పాదయాత్రలో పలుచోట్ల రైతులు, కూలీలు, యువకులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్‌ అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో నీటి కన్నా మద్యం ఏరులై పారుతుందన్నారు. ఇంగ్లిష్‌ మీడియానికి దిక్కులేదు కానీ, ఇంగ్లిష్‌ మందు మాత్రం దొరుకుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ జనాలకు గొర్లు, బర్లు ఇచ్చి.. తన కుటుంబానికేమో కావాల్సిన పద వులన్నీ ఇస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రజలకు తాగు, సాగు నీరందించేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల- ప్రాణ హిత ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే.. ఆయన ఆశయానికి, ఈ ప్రాంత ప్రజల కలలకు కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారన్నారు.  ప్రాణాహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డిజిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు వైఎస్‌ఆర్‌ నిర్ణయిస్తే.. కేసీఆర్‌ వచ్చి తల, తోక తీసేసి ఈ ప్రాంత రైతులకు కన్నీళ్లు మిగిల్చారన్నారు. రంగారెడ్డిజిల్లాకు గోదావరి, కృష్ణ నీళ్లు తేస్తామని చెప్పిన కేసీఆర్‌ మాట నిలబెట్టుకోలేదన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కావాలని జనం కలలు కంటున్నారని, అందుకే ప్రజాప్రస్థానంతో ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు. తెలంగాణ ఆడపడుచుగా మీ ఇంటిముందుకు వస్తున్నానని, ఆశీర్వదించి ఆదరించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రజలు ఆశీర్వదిస్తే రాజన్నరాజ్యం తీసుకొస్తానని వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో పాలన ప్రజలు ఆశించిన విధంగా లేదన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమని, అందుకే వైఎస్‌ఆర్‌టీపీ స్థాపించినట్లు చెప్పారు. ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో 14 నెలలపాటు కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్ర ముగింపు సభ కూడా చేవెళ్లలోనే ఉంటుందన్నారు. 2003లో వైఎస్‌ఆర్‌ చేపట్టిన మహాప్రస్థానం అప్పట్లో రాష్ట్ర దిశ, దశనే మార్చిందని స్పష్టం చేశారు. రాజన్న పాలన స్ఫూర్తితో తాను ప్రజల్లోకి వచ్చానని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రకంపనలు సృష్టించబోతున్నట్లు షర్మిల పేర్కొన్నారు. మా కుటుంబానికి చేవెళ్ళ గడ్డ అచ్చివొచ్చిందని, తాను చేపట్టిన పాదయాత్ర కూడా చరిత్ర సృష్టించబోతుందన్నారు.


సమస్యలు ఏకరవు

మొయినాబాద్‌ మండలంలోని నక్కలపల్లి, వెంకటాపూర్‌, కేతిరెడ్డిపల్లి, చాకలిగూడ, కవేలిగూడ గ్రామాల్లో జరిగిన ప్రజాప్రస్థానంలో రైతులు, మహిళలు షర్మిలకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కేసీఆర్‌ పాలనతో తమ బతుకులు బుగ్గిపాలయ్యాయన్నారు. ఇళ్లు లేక గుడిసెల్లోనే ఎండకు ఎండుతూ వానకు నానుతున్నామని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. భర్త చనిపోయి రెండేళ్లువుతున్నా పింఛన్లు రావడంలేదని కొందరు మహిళలు తెలిపారు. అర్ధ ఎకరం భూమి ఉన్నా రేషన్‌కార్డు తొలగించారని.. గ్యాస్‌, కరెంట్‌ బిల్లులు పెరిగి ఇబ్బందులు పడుతున్నామన్నారు. రాజన్నపాలనలో రైతులకు ఒకేసారి లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని, పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు వచ్చాయని రైతులకు, సబ్సిడీలతో కూడిన వ్యవసాయం కొనసాగించారని చెపుకున్నారు. ప్రస్తుతం వంట గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని కొండని అంజమ్మ, సత్యమ్మ,  జి. కృష్ణవేణి, పావన్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీపాల్‌, నర్సింలు తదితర రైతులు అవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన షర్మిల మాట్లాడుతూ.. రాజన్నరాజ్యం తీసుకొచ్చేందుకే ప్రజల ముందుకొచ్చానని చెప్పారు. పెంచిన ధరలను తగ్గించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పేదల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏదిఏమైనా తమ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, చేవెళ్ల నియోజక కన్వీనర్‌ డేవిడ్‌ దయానంద్‌, చేవెళ్ల, షాబాద్‌, మొయినాబాద్‌ మండలాల కన్వీనర్లు శివారెడ్డి, యాదయ్య, రాములు, జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు నాగమణి, పార్టీ నాయకులు రవీందర్‌రెడ్డి, చెన్నరెడ్డి, గురు వీరారెడ్డి పాల్గొన్నారు.


మల్కారంలో మాట..ముచ్చట

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల చేపట్టిన ప్రజాప్రస్ధానం పాదయాత్రలో భాగంగా గురువారం శంషాబాద్‌ మండల పరిధిలోని మల్కారంలో మాటముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన మహిళలు, రైతులు తమ సమస్యలు షర్మిలతో చెపుకున్నారు. మాటముచ్చట గంటన్నర వరకు కొనసాగింది. 

పోచమ్మ, ఎక్‌బార్‌పల్లి : మా పిల్లలు డిగ్రీలు చదువుకున్నా కొలువులు లేవు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేసీఆర్‌ కొలువులు ఇస్తామని చెప్పడం తప్ప ఇవ్వడం లేదు. 

మంగమ్మ, నర్కూడ : పెంచిన గ్యాస్‌ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, కూలి పనులు చేసుకుని బతికే మాకు ఽఽపెరిగిన ధరల మూలంగా కుటుంబం గడవడం కష్ఠంగా మారింది. 

సుజాత, కవేలిగూడ :భారీ వర్షాలకు పంటలు నష్టపోయాం. ఇప్పటివరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.

కళావతి, కేతిరెడ్డిపల్లి: ఓట్లసమయంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్న అధికారపార్టీ సర్పంచ్‌, ఇప్పుడు వాటి గురించే పట్టించుకోవడం లేదు.

సురేష్‌, రామాంజపురం : లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి, రూ.25 వేల వరకే చేశారు. మిగతా వారి గురించి పట్టించుకోవడం లేదు.

రాము, పెద్దమంగళారం : పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించడం లేదు. రోగం వస్తే అప్పులు చేసి ఆస్పత్రి బిల్లులు కట్టాల్సి వస్తోంది, రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీతో ఉచితంగా  వైద్యం అందించారు. 

ప్రజల సమస్యలు ఓపికగా విన్న షర్మిల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు.


షర్మిలను కలిసిన విజయమ్మ

ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిలను గురువారం ఆమె తల్లి విజయమ్మ మొయినాబాద్‌ మండలం వెంకటాపూర్‌లో కలిశారు. ఇద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.


కాచారంలో రాత్రి బస

ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండోరోజు 12 కిలో మీటర్ల కొనసాగింది. శంషాబాద్‌ మండలం కాచారంలోని వర్ధమాన్‌ కళాశాల సమీపంలో రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం షర్మిల పాదయాత్ర నర్కూడ, రాళ్లగూడ, శంషాబాద్‌, పోశెట్టిగూడ వరకు కొనసాగనుంది. సాయంత్రం శంషాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.Updated Date - 2021-10-22T05:15:52+05:30 IST