బీమా... ధీమా!

ABN , First Publish Date - 2021-08-28T04:25:00+05:30 IST

అన్నదాతల కుటుంబాల్లో కొండంత భరోసా నింపే రైతు బీమా పథకం పట్ల అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ పథకం వర్తించని రైతులు బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు కొత్తగా అవకాశం కల్పించింది.

బీమా... ధీమా!

  • గత ఏడాది 1,22,834 మంది రైతులకు రైతు బీమా 
  • జిల్లాలో కొత్తగా మరో 25 వేల మందికి..  
  • ఒక్కో రైతు పేరిట రూ.3,457 వంతున ప్రీమియం చెల్లింపు

   అన్నదాతల కుటుంబాల్లో కొండంత భరోసా నింపే  రైతు బీమా పథకం పట్ల అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ పథకం వర్తించని రైతులు బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు కొత్తగా అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలో ప్రస్తుతం బీమా వర్తిస్తున్న రైతులతో పాటు అదనంగా మరో 25 వేల మందికి ప్రయోజనం కలగనుంది.  రైతు మృతి చెందిన పది రోజుల్లోగా పరిహారం  నామినీ ఖాతాలో జమయ్యేలా  అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి)

 రైతు బీమా పథకానికి కొత్తగా అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. పట్టాపాస్‌ పుస్తకం ఉండి రైతు బీమా పరిధిలోకి రాని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు విధించింది. మూడేళ్లుగా అమలు చేస్తున్న రైతుబీమా పథకం మరో ఏడాది పొడిగించేందుకు అవసరమైన ప్రీమియం చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఏదైనా కారణంతో రైతు మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారంగా అందే విధంగా సర్కారు బీమా సదుపాయం కల్పించింది. అన్నదాతల కుటుంబాల్లో కొండంత భరోసా నింపే విధంగా ఉన్న రైతు బీమా పథకం పట్ల అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రైతుబీమా వర్తించని రైతులు బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొత్తగా అవకాశం కల్పించడంతో జిల్లాలో అదనంగా మరో 25 వేల మంది రైతుల వరకు బీమా ప్రయోజనం కలగనుంది. రైతు ఏ కారణంతో మృతి చెందినా ఆ రైతు తరపున నామినీగా నమోదైన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తున్నారు. రైతు మృతి చెందిన పది రోజుల్లోగా పరిహారం నామినీ ఖాతాలో జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతఏడాది జిల్లాలో  రైతు బీమా పథకంలో 1,02,922 మంది రైతులు నమోదయ్యారు. ఏడాది పాటు బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఒక్కో రైతు పేరిట రూ.3,457 వంతున వార్షిక ప్రీమియం ఒకేసారి చెల్లిస్తున్న విషయం తెలిసిందే. రైతు బీమా పథకం 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపు ఉన్న రైతులకు వర్తింపజేశారు.  

59 ఏళ్లలోపు రైతులందరూ అర్హులు

గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 59 సంవత్సరాలలోపు  రైతులందరూ ఈ పథకంలో చేరడానికి అర్హులు కానున్నారు. గతేడాది జిల్లాలో 1,22,834 మంది రైతులకు బీమా వర్తించగా, ఆ సంఖ్యకు అదనంగా మరో 25 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఆన్‌లైన్‌లో నమోదై పట్టాపాసు పుస్తకాలు పొందిన రైతులను అర్హులుగా పరిగణించనున్నారు. కొత్తగా రైతు బీమా పథకం పరిధిలోకి వచ్చే రైతులు తమ పట్టాపాస్‌ పుసక్తం, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, నామినీ వివరాలనువ్యవసాయ విస్తరణ అధికారులకు ఈనెల 30వ తేదీలోగా అందజేస్తే వారు పరిశీలించి బీమా పథకంలో చేర్చనున్నారు.  తమను బీమా పరిధిలోకి తీసుకురావడం పట్ల కొత్త రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 

2,381 మంది బాధిత  రైతు కుటుంబాలకు లబ్ధి

జిల్లాలో 1,22,834 మంది రైతులు రైతుబీమా పథకంలో నమోదు కాగా, మూడేళ్లలో 2,582 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. మృతి చెందిన ఈ రైతుల్లో ఇప్పటి వరకు 2,381 మంది అన్నదాతలకు  బీమా పరిహారం కింద రూ.119.05 కోట్లు విడుదల చేశారు. మృతి చెందిన రైతుల నామినీలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల వంతున పరిహారం చెల్లించారు.

Updated Date - 2021-08-28T04:25:00+05:30 IST