పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2021-08-28T04:11:34+05:30 IST

ఈ నెల 31లోపు ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
కందుకూరు సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 


కందుకూరు: ఈ నెల 31లోపు ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, సెప్టెంబర్‌ 1 నుంచి కొవిడ్‌ నిబంధనల ప్రకారం విద్యాసంస్థలను ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీపీ మంద జ్యోతి అధ్యక్షతన మండల పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యాసంస్థలు ప్రారంభించడానికి ఇంకా మూడు రోజులే ఉన్న నేపథ్యంలో ప్రతి పాఠశాలలో విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు సర్పంచ్‌లు, అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత పాఠశాలలు, వసతి గృహాల్లో ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వైరల్‌ ఫీవర్‌ విజృంభిస్తున్నందున పాఠశాలల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల ఫోన్‌నెంబర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. 

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపాధ్యాయులు తమకు సహకరించడం లేదని నేదునూరు, దెబ్బడగూడ గ్రామాల సర్పంచ్‌లు రామక్రిష్ణారెడ్డి, ఏనుగు శ్రావణి మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రజాప్రతినిధులకు సహకరించని వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. మండలపరిధిలోని 35 గ్రామపంచాయితీల్లో 17గొర్రెలు, మేకలకాపర్ల సంఘాల సొసైటీల కాలపరిమితి పూర్తయినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్‌ రేవతి తెలిపారు. త్వరలో సొసైటీల్లో ఉన్న సభ్యులు రూ.51 సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేసుకొని కొత్త సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జడ్పీనిధుల నుంచి ఇప్పటికే 5గ్రామాల్లో అంగన్‌ వాడీ భవనాలు మంజూరైనట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన ముచ్చర్ల, మీర్కాన్‌పేట, సాయిరెడ్డిగూడ, బేగరికంచ, సార్లరావులపల్లి గ్రామాల్లో టీఎస్‌ఐసీసీ నుంచి అంగన్‌వాడీ భవనాలతోపాటు గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మండల పరిధిలో 168 కుంటలు, చెరువులు ఉన్నాయని, వాటి నివేదికలను ఇరిగేషన్‌ అధికారులు ఇవ్వాలని, అవి అన్యాక్రాంతం కాకుండా హద్దులు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా భూదాన్‌, వక్ఫ్‌బోర్డు, అసైన్డ్‌ భూములు నివేదికలను ఇవ్వాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైస్‌ఎంపీపీ జి.శమంతప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌డీవో వెంకటాచారి, మిషన్‌భగీరథ ఈఈ జగన్‌ మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఎస్‌.జ్యోతి, ఎంపీడీవో జి.కృష్ణకుమారి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


ప్రొటోకాల్‌ వివాదం

కాగా, సమావేశం ప్రారంభ సమయంలో కందుకూరు ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి, కొత్తూరు ఎంపీటీసీ బి.జ్యోతిల మధ్య ప్రొటోకాల్‌ వివాదంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల మంత్రి సమక్షంలో శంకుస్థాపన చేసిన విద్యుత్‌ డీఈ కార్యాలయం వద్ద తన పేరును తొలగించడానికి జ్యోతి ప్రయత్నించారని రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. రాజశేఖర్‌రెడ్డి తనను కించపర్చారంటూ జ్యోతి సభలో నేలపై కుర్చొని నిరసన తెలిపారు. ఎంపీపీ మంద జ్యోతి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి కల్పించుకొని ఆమెను శాంతింపజేశారు.Updated Date - 2021-08-28T04:11:34+05:30 IST