అనంతగిరిలో అంటువ్యాధుల నివారణ కేంద్రం

ABN , First Publish Date - 2021-07-09T04:56:02+05:30 IST

అనంతగిరిలోని ప్రభుత్వ క్షయ ఛాతి వ్యాధుల ఆసుపత్రిని

అనంతగిరిలో అంటువ్యాధుల నివారణ కేంద్రం
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ (ఫైల్‌)

  • 200పడకలతో ఏర్పాటుకు సన్నాహాలు 
  • ఆరోగ్య శాఖ నుంచి వైద్య విధాన పరిషత్‌కు బదిలీ
  • ఆసుపత్రులు పరిశీలించిన వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌రెడ్డి


ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి : అనంతగిరిలోని ప్రభుత్వ క్షయ ఛాతి వ్యాధుల ఆసుపత్రిని హైదరాబాద్‌ నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రి తరహాలో అంటువ్యాధుల నివారణ కేంద్రంగా మార్చబోతున్నారు. దీనికోసం ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, కొత్తగా కల్పించాల్సిన వాటి గురించి తెలుసుకునేందుకు బుధవారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌కుమార్‌ అనంతగిరిలోని క్షయ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా క్షయ ఆసుపత్రి భవన సముదాయం, వార్డులు, వైద్య సిబ్బంది నివాస గృహాలను పరిశీలించారు. అంటువ్యాధుల నివారణ కేంద్రం ఏర్పాటుకు ఏయే సదుపాయాలు కల్పించాల్సి ఉందనే విషయమై వారు వైద్య విధాన పరిషత్‌, వైద్య ఆరోగ్య, శాఖల అధికారులతో చర్చించారు. ప్రస్తుతం క్షయ ఆసుపత్రిలో 400 పడకల సదుపాయం ఉండగా, ఇక్కడ 200 పడకలతో ఫీవర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగుతున్న అనంతగిరి ప్రభుత్వ క్షయ, ఛాతి వ్యాధుల ఆసుపత్రిని త్వరలో వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. అనంతరం వారు రాజీవ్‌ కాలనీ వద్ద కొత్తగా నిర్మించిన ఏరియా ఆసుపత్రి,పాత సీహెచ్‌సీలను తనిఖీ చేశారు. సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్‌ హబ్‌ను వారు తనిఖీ చేసి.. రోజూ ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారనేది ఆరా తీశారు. పరీక్షల్లో ప్రజలు ఏయే వ్యాధులతో బాధపడుతున్నారనేది వారు తెలుసుకున్నారు. సీహె చ్‌సీ భవనంలోనే డీఎంహెచ్‌వో కారర్యాలయం కొనసాగుతోందని తెలుసుకుని వారు విస్తుపోయారు. ఆసుపత్రి భవనానికి అవసరమైన గదులు లేక ఇబ్బందులు పడుతుంటే జిల్లా కార్యాలయం అక్కడ కొనసాగించడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్‌, జాయింట్‌ కమిషనర్‌, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసును కలిసి అనంతగిరిలో ఫీవర్‌ ఆసుపత్రి ఏర్పాటు విషయమై చర్చించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌, డీఎంహెచ్‌వో సుధాకర్‌ ఉన్నారు. Updated Date - 2021-07-09T04:56:02+05:30 IST