పాఠశాలకు తాగునీరు బంద్ చేయడమేంటి?
ABN , First Publish Date - 2021-10-30T04:20:33+05:30 IST
పాఠశాలకు తాగునీరు బంద్ చేయడమేంటి?
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు
షాద్‌నగర్ అర్బన్ : పాఠశాల ఆవరణలోకి మిషన్ భగీరథ వృథా నీరు వదలొద్దని కోరిన కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థకు తాగునీరు బంద్ చేయడమేమిటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన పాఠశాలను సందర్శించి సిబ్బంది, విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాలకు ఆనుకుని ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుంచి వస్తున్న వృథా నీరు పాఠశాల ఆవరణలోకి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల సిబ్బంది బక్కనికి వివరించారు. వృథా నీరు వదులొద్దని కోరినందుకు ఏకంగా పాఠశాలకు తాగునీటిని బంద్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిషన్ భగీరథ ఈఈతో బక్కని మాట్లాడారు. ఈఈ సరైన సమాధానం చెప్పకపోగా పాఠశాలకు తాగునీరు కావాలంటే ముఖ్యమంత్రిని కలవండంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని బక్కని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత పిల్లలు చదువుతున్న పాఠశాలకు ఉద్దేశ్యపూర్వకంగా తాగునీటిని బంద్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ తాగునీటిని వెంటనే పునరుద్ధరించకపోతే ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా బక్కని నర్సింహులు హెచ్చరించారు.