దొంగమాటలు ఎన్నాళ్లు?

ABN , First Publish Date - 2021-03-23T05:24:52+05:30 IST

దొంగమాటలు ఎన్నాళ్లు?

దొంగమాటలు ఎన్నాళ్లు?

  • సీఎం కేసీఆర్‌పై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫైర్‌ 
  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు ఎందుకు మారింది?
  • పాలమూరు సమీక్షలో ఉమ్మడి రంగారెడ్డి మంత్రి, ప్రజాప్రతినిధులు ఏరీ?
  • ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే 
  • మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు నోరువిప్పరా?

(ఆంరఽధజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సీఎం కేసీఆర్‌ ఇంకా మోసం చేస్తూనే ఉన్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడిచినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చుక్క సాగునీరు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని సమీక్షలు, కోర్టు కేసులని సీఎం కేసీఆర్‌ అసంబద్ధమైన కారణాలు చెబుతున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో ఘాటు విమర్శలు చేశారు. గత ఏడాది మృగశిర నాటికి ఈ ప్రాంత వాసులకు సాగునీరు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని,  కానీ రెండో మృగశిర కాలం వస్తున్నా ఇంత వరకు టెండర్లే పిలవలేదు.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇలా ఎన్నిసార్లు దొంగమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణాజలాలను తరలించుకుపోతుంటే చప్పుడు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈవిషయాన్ని కృష్ణానదీ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు కూడా ఫిర్యాదుచేయని అసమర్ధుడు కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం సమీక్షకు రంగారెడ్డి, వికారాబాద్‌ ప్రజాప్రతినిధులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఇక్కడ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు దీనిపై నోరెందుకు విప్పడం లేదన్నారు. దీని వెనుక ఏదో అంతర్యం ఉందనే విషయం దీన్నిబట్టి అర్థమవుతుందన్నారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి ఈ ప్రాంత ప్రజల నోట్లో మన్నుపోసిన కేసీఆర్‌ ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలోనూ అలానే చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరులో రంగారెడ్డిని ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. పథకం పేరు మార్చడం ద్వారా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలను ఏడారిగా చేయడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇంత కుట్ర పన్నుతుంటే జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లడం లేదు.. వారికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌ ఉప  ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కొద్దిగా మిగిలిన పనిని పూర్తిచేస్తానని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 


Updated Date - 2021-03-23T05:24:52+05:30 IST