ముదురుతున్న ఎండలు

ABN , First Publish Date - 2021-03-22T05:41:17+05:30 IST

ముదురుతున్న ఎండలు

ముదురుతున్న ఎండలు
ఆమనగల్లులో పండ్ల రసాల అమ్మకాలు

  • జోరందుకున్న శీతల పానీయాల విక్రయాలు
  • కొబ్బరిబోండాలకూ భలే గిరాకీ
  • పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతం

ఆమనగల్లు/చేవెళ్ల/యాచారం: వేసవి ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు భగభగ   మండుతున్నాడు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లపై జనం సందడి తగ్గుతోంది. కాగా వేసవి తాపాన్ని తట్టుకోడానికి ప్రజలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. చల్లటి పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో సీజనల్‌ వ్యాపారాలు కూడా ప్రారంభించారు. ఆమనగల్లు, చేవెళ్ల, యాచారం ప్రధాన రహదారులపై ఎక్కడ చూసినా కొబ్బరిబోండాలు, పండ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు, పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలు శీతలపానీయాలు, వాటర్‌ ప్యాకెట్లు, బాటిళ్ళను కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరిబోండాలకు నాణ్యతనుబట్టి రూ.35 నుంచి 40వరకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయలు కిలో రూ. 20నుంచి 30వరకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. యాచారం మండల కేంద్రంలో సాగర్‌ ప్రధాన రహదారిపై పుచ్చకాయలు జోరుగా విక్రయిస్తున్నారు. గ్రామాల్లో తయారైన మట్టి కుండలను తీసుకువచ్చి పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. యాచారం మండలం నందివనపర్తిలో తయారుచేసిన మట్టికుండలు ప్రత్యేకమైనవి. కుండ సైజును బట్టి రూ. 150నుంచి 250వరకు విక్రయిస్తున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, కాటన్‌ దుస్తులు, క్యాప్‌ల విక్రయాలు కూడా మొదలయ్యాయి. కాగా చేవెళ్ల, ఆమనగల్లు పట్టణంలో వందలాది మంది వివిధ వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు.

Updated Date - 2021-03-22T05:41:17+05:30 IST