లైఫ్‌ కోసం హెల్మెట్‌ వాడాలి

ABN , First Publish Date - 2021-08-22T04:13:41+05:30 IST

లైఫ్‌ కోసం హెల్మెట్‌ వాడాలి

లైఫ్‌ కోసం హెల్మెట్‌ వాడాలి
ర్యాలీకి తరలివచ్చిన వాహనదారులు

  • ప్రముఖ సినీ, టీవీ నటులు బిత్తిరి సత్తి, కొమురం
  • షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ 
  • తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ట్రాఫిక్‌ ఎస్సైకు చోటు


షాద్‌నగర్‌/షాద్‌నగర్‌ రూరల్‌: శిరస్ర్తాణం ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, ఈ విషయాన్ని గుర్తించి ప్రతీ ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్‌ ధరించాలని పోలీస్‌ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం హెల్మెట్‌ ధరించని వారే మరణిస్తున్నారన్నారు. శనివారం షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో హెల్మెట్‌ ధారణపై 3వేల బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ, టీవీ నటులు బిత్తిరి సత్తి, కొమురం, శంషాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ విశ్వప్రసాద్‌, షాద్‌నగర్‌ ఏసీపీ సీహెచ్‌ కుషాల్కర్‌, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, కమిషనర్‌ లావణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ ఫైన్‌ నివారణ కోసం హెల్మెట్లు కాదని, లైఫ్‌ కోసం వాడాలని సూచించారు. శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా బతకొచ్చుగానీ తల లేకుంటే బతకలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కొమురం మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు తమ కుటుంబం కోసమైనా హెల్మెట్‌ ధరించాలన్నారు. షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనల అమలుపై రాజీపడబోమన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రతి రోజూ 5 నుంచి 10 ప్రమాదాలు జరుగుతున్నాయనీ, హెల్మెట్‌ ధరించక ఐదుగురు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించి చలానాల నుంచి విముక్తి పొందాలన్నారు. రఘుకుమార్‌ మాట్లాడుతూ వాహనదారులకు హెల్మెట్‌ ధరించడంపై అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహించామన్నారు. ర్యాలీలో పాల్గొనడానికి పట్టణం నుంచి వివిధ వ్యాపార వర్గాలు, ఆటో, జీప్‌, మెకానిక్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల ప్రతినిధులు తరలివచ్చారు.

తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు 

హెల్మెట్‌పై అవగాహన కోసం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించినందుకు షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ ఎస్సై రఘుకుమార్‌కు తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. సంస్థ ప్రతినిధులు రఘుకుమార్‌కు ప్రశంసాపత్రం, మెడల్‌అందజేసి అభినందించారు.

Updated Date - 2021-08-22T04:13:41+05:30 IST