మత్తు.. చిత్తు!

ABN , First Publish Date - 2021-07-13T04:47:07+05:30 IST

మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.

మత్తు.. చిత్తు!

  • పరిగి కేంద్రంగా గుట్కా,, గంజాయి వ్యాపారం
  • రాష్ట్ర సరిహద్దులోని వ్యవసాయ క్షేత్రాల్లో స్థావరాలు?
  • చెక్‌పోస్టులున్నా ఆగని అక్రమ రవాణా
  • యువకుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారం
  • రూ.లక్షలు దండుకుంటున్న అక్రమార్కులు
  • కొరవడిన అధికారుల నిఘా 


మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు మత్తు పదార్థాలను తరలిస్తూ.. పబ్బం గడుపుకుంటున్నారు. అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని సరుకును గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు.  నిషేధిత మత్తు పదార్ధాల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. మత్తుకు బానిసవుతున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండడంతో వ్యాపారం అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన మత్తు దందా ఇప్పుడు గ్రామాలకు విస్తరించింది. యువత మత్తుకు అలవాటు పడి మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది.


పరిగి: వికారాబాద్‌ జిల్లాలోని పరిగి కేంద్రంగా కొందరు మత్తు పదార్ధాల వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గుట్కాల మాటులో గంజాయి, మత్తు పదార్ధాలను విక్రయిస్తూ అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఏదో ఒక చోట గుట్కాల పట్టివేత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పరిగిలోనే ఇటీవల రెండు కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు పరిగిలో స్థిరపడి వ్యాపారం కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు రోజుల క్రితం పరిగిలోని శాంతినగర్‌లో కల్లు విక్రయించే బాలుడు తోటి స్నేహితులకు సిగరెట్‌లో గంజాయి కలిపి తాగించాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

చెక్‌పోస్టులున్నా.. ఆగని అక్రమ రవాణా

అక్రమార్కులు మత్తు పదార్ధాలను పూణే, బీజాపూర్‌, గుల్బర్గా, సేడం ప్రాంతాల నుంచి గుట్టుగా పరిగికి తీసుకువచ్చి, ఇక్కడి నుంచి హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఉన్నా అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక నుంచి జిల్లాకు వచ్చేందుకు రావులపల్లి వద్ద అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు ఉంది. అక్కడ వివిధ శాఖలకు చెందిన అధికారులు నిరంతరం తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ తనిఖీలు కట్టుదిట్టం లేకపోవడంతో అక్ర మ రవాణకు అడ్డులేకుండా పోతోందనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. కాగా, చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారన్న సమాచారంతో అక్రమార్కులు ఒక్కోసారి జిల్లాలోకి ఇతర మార్గాల ద్వారా యథేచ్ఛగా మత్తు పదార్ధాల రవాణా చేస్తున్నారు. ఇటీవల వికారాబాద్‌ పట్టణంలో టాస్క్‌ఫోర్స్‌, వికారాబాద్‌ పోలీసులు సం యుక్తంగా దాడులు చేసి నలుగురు వద్ద నుంచి రూ.90వేలు విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా నిత్యం ఏదో ఒకచోట గుట్కా, గంజాయి పట్టుబడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

వ్యవసాయ క్షేత్రాలే అడ్డాలు!

గంజాయి, గుట్కాల తయారీ, రవాణాకు జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలను అడ్డాలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, తాండూరు శివార్లలో రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో ఏజెంట్ల ద్వారా గట్టుగా గంజాయి, గుట్కాలను తరలిస్తూ కోట్ల రూపాయలు వ్యాపా రం కొనసాగిస్తున్నారు. కాగా, అక్రమార్కులు కిందిస్థాయి పోలీస్‌ సిబ్బంది సహాయసహకారాలు తీసుకుని దందా చేస్తున్నట్లు సమాచారం. 

లక్షల్లో అక్రమ దందా..

 మత్తు పదార్ధాల దందా లావాదేవీలు లక్షల రూపాయల్లో జరుగుతోంది. ఈ తరహాలో రోజుకు రూ.10 లక్షల వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం. తాండూరు, కొడంగల్‌, పరిగి 100కుపైగా హోల్‌సేల్‌ కేంద్రాలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో గుట్కా వ్యాపార కేంద్రం లో నిత్యం కనీసం రూ.10 నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

నిఘా కట్టుదిట్టం చేశాం 

గుట్కా, గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై నిఘా కట్టుదిట్టం చేశాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా గంజాయి, గుట్కా విక్రయిస్తున్నట్లు తెలిసి పోలీసులకు సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యగా ఉంచుతాం. 

- డీకే.లక్ష్మిరెడ్డి, సీఐ, పరిగి

Updated Date - 2021-07-13T04:47:07+05:30 IST