పెరుగుతున్న విద్యార్థుల హాజరుశాతం

ABN , First Publish Date - 2021-02-06T04:20:23+05:30 IST

పెరుగుతున్న విద్యార్థుల హాజరుశాతం

పెరుగుతున్న విద్యార్థుల హాజరుశాతం
గొట్టిగఖుర్ధు జడ్పీ పాఠశాలలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన

  • బషీరాబాద్‌ మండలంలో 71శాతం హాజరు 
  • కొవిడ్‌ నిబంధనలతో విద్యార్థులకు బోధన 


బషీరాబాద్‌: కొవిడ్‌ మహమ్మరి కారణంగా ఎనిమిది నెలలకు పైగా మూతపడిన పాఠశాలలు ఈనెల 1వ తేదీ నుంచి పునః ప్రారంభమెన విషయం తెలిసిందే. కాగా మొదటిరోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం అంతంతమాత్రంగానే ఉండగా రోజురోజుకు విద్యార్థుల హాజరుశాతం పెరుగుతోంది. జడ్పీ ఉన్నతపాఠశాలల్లో 9, 10 తరగతులకు బోధించేందుకు ప్రభుత్వం అనుమతులిస్తూ కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయులు వారం రోజుల ముందే తరగతి గదులను శానిటైజేషన్‌ చేయించారు. బషీరాబాద్‌ మండలంలోని 11జడ్పీ ఉన్నత పాఠశాలల్లో మొదటి రోజు తొమ్మిదో తరగతిలో 37శాతం, 10 వతరగతిలో 40శాతం, మోడల్‌ స్కూల్‌లో తొమ్మిదోతరగతిలో 18శాతం, 10వతరగతిలో 30శాతం విద్యార్థులు హాజరయ్యారు. కేజీబీవీలో మొదటి రోజు ఒక్క విద్యార్ధి కూడా హాజరుకాలేదు. రోజువారీగా  పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం 5 నుంచి 10శాతం పెరుగుతూ వస్తోంది. మండల వ్యాప్తంగా శుక్రవారం విద్యార్థుల హాజరుశాతం పరిశీలిస్తే తొమ్మిదో తరగతిలో 60శాతం, 10వతరగతిలో 71శాతం విద్యార్థులు హాజరైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. రోజూ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన తర్వాతే విద్యార్థులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్య మొదట్లో తక్కువగా ఉన్నా తల్లిదండ్రులు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

Updated Date - 2021-02-06T04:20:23+05:30 IST