ధాన్యం.. దైన్యం

ABN , First Publish Date - 2021-05-19T05:03:16+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతికి వచ్చిందని

ధాన్యం.. దైన్యం

  • అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం
  • కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతున్న వడ్లు
  • తుఫాను హెచ్చరికలు ఉన్నా చర్యలు శూన్యం
  • లారీలు, హమాలీల కొరతతో తప్పని ఇక్కట్లు


ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతికి వచ్చిందని ఆనందించేలోపే అకాల వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ధాన్యాన్ని అమ్ముకుం దామని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ అవస్థలు తప్పడం లేదు. అకాల వర్షాలకు కేంద్రాల వద్ద ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతోంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రైతుల కళ్లముందే ధాన్యం నీళ్లపాలవుతోంది.


వికారాబాద్‌(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు అన్నదా తలను నిండా ముంచుతు న్నాయి. మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయ డంలో అధికారులు చూపు తున్న నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తుఫాను హెచ్చరికలు ఉన్నా అధికారులు ధాన్యం రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వేలాది క్వింటాళ్ల ధాన్యం నీటిపాల వుతోంది. ఆదివారం కురిసిన వర్షానికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. ముందస్తు రక్షణ చర్యలు లేకపోవడంతో రైతుల కళ్లముందే ధాన్యం నీళ్లపాలైంది. 


సదుపాయాలు లేక..

వికారాబాద్‌ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోవడంతో కొత్తగా ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు హమాలీల కొరత కారణంగా లారీల్లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వేగంగా కొనసాగడం లేదు. మిల్లుల వద్ద రె ండు, మూడు రోజుల పాటు లారీలు నిలిచిపోతున్నాయి. కేంద్రాల్లో సేకరించే ధాన్యాన్ని ఏ రోజుకారోజు మిల్లులకు సరఫరా చేయాల్సి ఉండగా.. లారీల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. తుఫాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తాజాగా నష్టం వాటిల్లింది. ఒక్క సారిగా ధాన్యమంతా అమ్మకానికి రావడం వల్లే టార్పాలిన్లు సరిపోలేదని, వెంటనే తూకం వేసి తరలించాలంటే తేమ సమస్య ఆటంకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే, మరో మూడు రోజులు వర్ష సూచన ఉన్నప్పటికీ.. సోమవారం సైతం మార్కెట్లు, ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యానికి రక్షణ చర్యలు చేపట్టలేదు. పలుచోట్ల రైతులే కవర్లు తెచ్చుకొని ధాన్యంపై కప్పారు. 


ధాన్యం సేకరణ  ఇలా...

వికారాబాద్‌ జిల్లా నుంచి 1.18 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటిదాకా జిల్లాలో 16,880 టన్నులు సేకరించగా, కొనుగోలు కేంద్రాల్లో 4 వేల టన్నులు పేరుకుపోయాయి. సేకరించిన ధాన్యాన్ని ఏరోజుకారోజు తరలించక పోవడంతో కొత్తగా ఽధాన్యం తీసుకొచ్చే రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.

Updated Date - 2021-05-19T05:03:16+05:30 IST