రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2021-05-21T04:27:46+05:30 IST
రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి

- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు : దళారి వ్యవస్థను నిర్మూలించి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వరిధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం రూ.20వేల కోట్లు కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్సీ సందర్శించారు. రైతులను పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గన్నీబ్యాగుల కొరతతో ఇబ్బంది ఏర్పడుతుందని, సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తూకాలు సకాలంలో చేపట్టకపోవడంతో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని పలువురు రైతులు ఎమ్మెల్సీకి తెలిపారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని, సన్న ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేయాలని మార్కెట్ కార్యదర్శి శ్రీశైలం, పీఏసీఎస్ సిబ్బందిని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు. గన్నీబ్యాగుల కేటాయింపునకు ఉన్నతాధికారులతో మాట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితవిజయ్, కేఎన్‌ఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు మెకానిక్ బాబా, సురేందర్‌రెడ్డి, విజయ్‌రాథోడ్, తాళ్ల రవీందర్, రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన
ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని గురువారం ఎమ్మెల్సీ సందర్శించారు. రికార్డులను, పరిసరాలను, మందుల నిల్వను పరిశీలించారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్, వైద్య చికిత్సలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డాక్టర్ శ్రీకాంత్, వైద్య సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్సీ వెంట ఎంపీపీ అనితవిజయ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేత
ఆమనగల్లు, కల్వకుర్తి, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ నిధి ద్వారా మంజూరైన రూ.1.60లక్షల చెక్కులను గురువారం ఎమ్మెల్సీ తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు అనితవిజయ్, నాయకులు సురేందర్‌రెడ్డి, మెకానిక్ బాబా, తదితరులు పాల్గొన్నారు.