వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-06-28T05:17:42+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని

వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి
సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

  • సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేష్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, ఎంఎల్‌సీ ఒగ్గు మల్లేశం, దయానంద్‌లతో కలిసి సీఎం కేసీఆర్‌కు ఆమె వినతిపత్రం అందజేశారు. కొత్తగా ఏర్పాటైన వికారాబాద్‌ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, పేద ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాలను మంజూరు చేయాలని వారు కోరారు. వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో వికారాబాద్‌ జిల్లాను కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్‌ జిల్లాను గద్వాల జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్చినందుకు ఈ సందర్భంగా జిల్లా ఎమ్మెల్యేలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటైతే రాష్ట్రంలో మెడికల్‌  సీట్లు పెరుగుతాయని, పేద వర్గాలకు మెరుగైన వైద్యం చేరువవుతుందని మంత్రి ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు.  ఇప్పటికే సరస్వతి నిలయంగా వెలుగొందుతున్న వికారాబాద్‌లో అనంతగిరి మీదుగా వీచే గాలికి ఆరోగ్యాన్ని పంచే మహత్తర శక్తి ఉందని ఆమె వివరించారు.


సాగునీటి సమస్యలపై ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం

ఇదిలా ఉంటే, సాగునీటి సమస్యలపై త్వరలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ తనను కలిసిన నేతలకు చెప్పినట్లు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన సాగునీటి సమస్యలపై చర్చించేందుకు అవసరమైన సమాచారం సిద్ధం చేసుకోవాలని ఆయన వారికి సూచించినట్లు సమాచారం. 



Updated Date - 2021-06-28T05:17:42+05:30 IST