ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు
ABN , First Publish Date - 2021-10-26T04:21:19+05:30 IST
వాగులో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో

- వెంకటాపూర్ ఈసీ వాగు కత్వ వద్ద ఘటన
- గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
మొయినాబాద్: వాగులో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు గల్లంతవగా, ఈత రావడంతో ఓ యువకుడు సురక్షితంగా బయటపడిన ఘటన మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్ ఈసీవాగు కత్వ వద్ద సోమవారం చోటుచేసుకుంది. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన విక్కీ(21) తల్లిదండ్రులతో కలిసి మొయినాబాద్ మండలంలోని సజ్జన్‌పల్లిలో గల ఓ వ్యవసాయక్షేత్రంలో పనిచేస్తు న్నాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగ సముందర్‌కు చెందిన సి.ఆంజనేయులు కేతిరెడ్డిపల్లిలోని ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మొయినాబాద్ మండలం సజ్జన్పల్లి గ్రామానికి చెందిన పవన్‌కుమార్(18)కు స్నేహితులు. కాగా, ముగ్గురు కలిసి సోమవారం మధ్యాహ్నం వెంకటాపూర్ ఈసీవాగు కత్వ వద్దకు వెళ్లారు. విక్కీ, పవన్‌కుమార్‌కు ఈత రాదు. వాగు ఒడ్డున ఈతకొట్టేందుకు ముగ్గురూ నీళ్లలోకి దిగారు. కత్వ కింది భాగంలోని గుంతలో నీరు 20 అడుగుల వరకు లోతు ఉండటంతో విక్కీ, పవన్‌కుమార్ నీట మునిగిపోయారు. ఆంజనే యులుకు ఈత రావడంతో బయటకు వచ్చాడు, ఆంజనేయులు విషయాన్ని స్థానికులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపునకు ఇబ్బంది ఏర్పడింది. ఇన్స్పెక్టర్ రాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకున్నారు.