ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2021-09-04T04:36:23+05:30 IST

ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి కురిసిన జోరు

ముంచెత్తిన వాన
నాగారం మున్సిపాలిటీ సాయిసంజీవనగర్‌ కాలనీలోకి చేరిన వరద నీరు

ఆంధ్రజ్యోతి,రంగారెడ్డిఅర్బన్‌/ఆమనగల్లు/ ఇబ్రహీంపట్నం/మేడ్చల్‌ ఘట్‌కేసర్‌/కీసరరూరల్‌/ వికారాబాద్‌/ధారూరు :  ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి కురిసిన జోరు వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగు లువంకలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌లో అత్యధికంగా 8.06సెం.మీ, బాచ్‌పల్లిలో 6.58సెం.మీ. వర్షం కురిసింది. శామీర్‌పేటలో 6.14సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 4.80సెం.మీ, కూకట్‌పల్లిలో 5.57సెం.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం రాత్రి రంగారెడ్డిజిల్లా హయత్‌నగర్‌లో అత్యధికంగా 5.32సెం.మీ, కొందుర్గులో 4.83 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లిలో 3.63సెం.మీ, గండిపేటలో 3.81 సెం.మీ, సరూర్‌నగర్‌లో 3.64సెం.మీ. వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 5.13సెం.మీ, తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో 3.85సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం నాగారంలో 1.70సెం.మీ, మర్పల్లిలో1.63సెం.మీ.వర్షపాతం నమోదైంది. 


ఆమనగల్లులో జలాశయాలు కళకళ

ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వరి, పత్తి చేలలో వర్షం నీరు చేరింది. మాడ్గుల మండలం సుద్దపల్లి వాగు సాగి రాకపోకలు నిలిచిపోయాయి. 


పట్నంలో ఇళ్లలోకి చేరిన వరదనీరు

ఇబ్రహీంపట్నంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో సాగర్‌ రహదారిపై ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌ వరద నీటితో నిండిపోయింది. ఎస్టీకళాశాల మహిళా హాస్టల్‌లోని ప్రహరీ కూలింది. అలాగే కుమ్మరికుంట కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. చౌరస్తానుంచి మంచాల వెళ్లే రోడ్డులో బీటీ రోడ్డు దెబ్బతింది. 


మేడ్చల్‌లో..

మేడ్చల్‌లో గురువారం రాత్రి 11 గంటల తర్వాత కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. సెల్లార్‌లోకి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. మేడ్చల్‌ చెక్‌పోస్టు పారిశ్రామికవాడలోని పలు పరిశ్రమల్లోకి వర్షపు నీరు చేరింది. కండ్లకోయ 9వవార్డులో పెంకుటిళ్లు కూలిపోయింది. అదేవిధంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 


ఘట్‌కేసర్‌లో భారీ వర్షం

 ఘట్‌కేసర్‌లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన వర్షం రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసింది. ఇప్పటికే నిండుకుండల్లా మారిన రాయికుంట, చెటేరుకుంట చెరువులు ఉధృతంగా అలుగుపారుతున్నాయి. ఘట్‌కేసర్‌లో 42.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


నాగారం, దమ్మాయిగూడలో మోస్తరు వర్షం

అల్పపీడన ప్రభావంతో గురువారం అర్ధరాత్రి నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం కీసర మండల పరిధిలో 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని వీఎన్‌ఎస్‌ హోమ్స్‌, ఎల్‌ఎన్‌ఆర్‌కాలనీ, అంజనాద్రినగర్‌, ఇందిరమ్మకాలనీ, స్నేహపురికాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతమైన దమ్మాయిగూడ నుంచి నాగారం మున్సిపాలిటీకి వరద పోటెత్తింది. రాంపల్లిచౌరస్తాలో ప్రధాన రహదారిలో దాదాపు అడుగు మేర వరద పారింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ పోలీసులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. దిగువ ప్రాంత కాలనీ సాయిసంజీవనగర్‌ కాలనీలో పెద్దఎత్తున వరదనీరు వచ్చి చేరింది. డ్రైనేజీ పైకప్పు తొలగించి నీరు సజావుగా ప్రవహించేందుకు తాత్కాలిక చర్యలు చేపట్టారు. 


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ జిల్లాలో గురువారం రాత్రి సైతంభారీ వర్షం కురవడంతో గొట్టిముక్ల, కోట్‌పల్లి చెరువులు అలుగుపారాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వికారాబాద్‌ పట్టణంలో భారీ వర్షం కురిసింది. మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ధారూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి దోర్నాల సమీపంలోని కాగ్నా ఉపనది తాత్కాలిక వంతెనపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో ధారూరు-నాగారం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. బాచారం వాగు రోడ్డు పైనుంచి ప్రవహించింది. Updated Date - 2021-09-04T04:36:23+05:30 IST