హెచ్‌ఆర్‌ఏ పైనే దృష్టి!

ABN , First Publish Date - 2021-12-29T04:21:50+05:30 IST

ఉపాధ్యాయులంతా హెచ్‌ఆర్‌ఏ ఎక్కువ ఉన్న

హెచ్‌ఆర్‌ఏ పైనే దృష్టి!
ఆప్షన్‌ ఫామ్స్‌ అందించేందుకు ఎగబడుతున్న టీచర్లు

  • హెచ్‌ఆర్‌ఏ తక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు టీచర్ల నిరాసక్తి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉపాధ్యాయులంతా హెచ్‌ఆర్‌ఏ ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా అనుకూలమైన ప్రాంతానికి.. హెచ్‌ఆర్‌ఏ అధికంగా వచ్చే చోటుకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు సుముఖత చూపడం లేదు. ఉదాహరణకు పట్టణ ప్రాంతంలో ఒక టీచర్‌కు నెలసరి వేతనం రూ.85వేలు ఉంటే.. 25 శాతం చొప్పున రూ.16,500 హెచ్‌ఆర్‌ఏ వస్తుంది. అదే గ్రామీణ ప్రాంతమైతే.. 12శాతం హెచ్‌ఆర్‌ఏ రూ.8,400 వస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయుడు నష్టపోతున్నాడు. గ్రామీణ ప్రాంతంలో పని చేయాలంటే.. దూరభారం పెరగడంతోపాటు రవాణా చార్జీలు భారం మరో రూ.4వేలు అదనంగా అవుతుంది. 

ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు పోస్టుల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. కీలకమైన పోస్టులను స్థానిక సీనియర్లు కోల్పో వాల్సి వస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటివరకు పొందిన హెచ్‌ఆర్‌ఏను కోల్పోవడంతోపాటు సాధారణ బదిలీల్లో భాగంగా హెచ్‌ఆర్‌ఏ తక్కువగా వచ్చే మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుం దని వారంతా దిగులుతో ఉన్నారు. అభ్యంతరాల స్వీకరణలో భాగంగా ఇతర జిల్లాల నుంచి వచ్చినవారి సీనియారిటీ జాబితాను సరిచేసి కౌన్సె లింగ్‌ నిర్వహిస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ చూపించిన ఉపాధ్యాయ ఖాళీల్లో 250కి పైగా పట్టణ ప్రాంతాల్లో పోస్టులు ఉన్నాయి. స్థానికంగా ఉన్నవారికి కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి వీటిని కేటాయిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులను పక్కనపెట్టి వారికే కౌన్సెలింగ్‌ నిర్వహించి పట్టణ ప్రాంతాల్లో పోస్టులు కట్టబెడితే ఆ తర్వాత జరిగే సాధారణ బదిలీల్లో తమకు అవకాశం దక్కకుండా పోతుందని వాపోతున్నారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్నవారు ఆ తర్వాత ఖాళీలు లేక మారుమూల ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని, హెచ్‌ఆర్‌ఏ  తక్కువగా టీచర్లకు ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వాలని.. లేదా హెచ్‌ఆర్‌ఏ అందరికీ సమానంగా అందజేయాలంటున్నారు.


క్రమశిక్షణ తప్పిన టీచర్లు

బడిలో పిల్లలకు క్రమ శిక్షణను నేర్పుతున్న పంతుళ్లే దారి తప్పారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం నుంచి ఆప్షన్‌ ఫామ్స్‌ స్వీకరిస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల వరకు ఆప్షన్‌ ఫామ్స్‌ అందజేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించడంతో టీచర్లంతా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆప్షన్‌ఫామ్స్‌ నింపిన టీచర్లు అధికా రులకు ఇచ్చేందుకు పోటీపడ్డారు. ఈ సమయంలో క్రమశిక్షను తప్పారు. క్యూలో నిలబడకుండా గుంపుగా ఒకచోటకు చేరి ఫామ్స్‌ ఇవ్వడానికి ఎగ బడ్డారు. కౌంటర్‌ ఒకటే ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. తిరిగి మరో కౌంటర్‌ ఏర్పాటు చేసి ఆప్షన్‌ ఫామ్స్‌ను స్వీకరించారు. ఇక ఆప్షన్‌ ఫామ్స్‌ అందించిన టీచర్లు కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 


బలవంతపు బదిలీలను నిలిపేయాలని సెక్రటేరియట్‌ ముట్టడి 

317 జీవోను రద్దుచేసి బలవంతపు బదిలీలను నిలుపుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సెక్రటేరియట్‌ను ముట్ట డించారు. కార్యక్రమంలో గాలయ్య, రాములు, వెంకటప్ప, కల్ప, గోపాల్‌ నాయక్‌, నాగేంద్రం, నరసింహగౌడ్‌, శివారెడ్డి, రఘుపాల్‌, శ్రీశైలం, రామ కృష్ణ, కిషన్‌ పాల్గొన్నారు.


నాలుగు రోజులుగా తిరుగుతున్నా... పట్టించుకోవడం లేదు

నాలుగు రోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా.. నన్ను ఎవరూ పట్టించు కోవడం లేదు. నేను ఇంగ్లిష్‌ మీడియం టీచర్‌ను అయితే... సీనియారిటీ జాబితాలో తెలుగు మీడియం అని తప్పుగా పడింది. ఆప్షన్‌ ఫామ్స్‌లో అధికారులకు తెలిపాను. కొత్తగా ప్రదర్శించిన సీనియారిటీ జాబితాలో రెండుచోట్ల పేరు వచ్చింది. కానీ.. ఒక చోట తెలుగు మీడియం, మరోచోట ఇంగ్లీష్‌ మీడియం అని పడింది. రంగారెడ్డిజిల్లా కోరుకుంటే.. మహబూబ్‌ నగర్‌లో పోస్టు చూపిస్తుంది. రంగారెడ్డిలో  పోస్టు ఖాళీ అని చూపి స్తుంది. నా తర్వాత వచ్చిన జూనియర్లకు రంగారెడ్డి వచ్చింది. జాబి తాలో పడిన తప్పును సరిచేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూన్నా ఎవరూ స్పందించటం లేదు.

- ప్రీతి, ఎస్‌జీటీ, శంకర్‌పల్లి మండలం, ఎర్వగూడ పాఠశాలUpdated Date - 2021-12-29T04:21:50+05:30 IST