తొలి రోజు ఇంటర్ పరీక్ష ప్రశాంతం
ABN , First Publish Date - 2021-10-26T04:30:09+05:30 IST
తొలి రోజు ఇంటర్ పరీక్ష ప్రశాంతం

- తాండూరులో ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని అనుమతించని నిర్వాహకులు
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌జిల్లా ప్రతినిధి / ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి /తాండూరు/ ఘట్‌కేసర్): వికారాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 29 కేంద్రాల్లో 9237 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 8493 మంది హాజరయ్యారు. 744 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థుల్లో 91.94 శాతం మంది హాజరయ్యారు. సోమవారం తాండూరులోని పరీక్షా కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు, డెక్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయగా, పరిగిలోని పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. తాండూరులో మొదటి రోజు 2707 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 2,484 మంది విద్యార్థులు హాజరయ్యారు. 223మంది గైర్హాజరయ్యారు. తాండూరులో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థి ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్లడంతో నిర్వాహకులు అనుమతివ్వలేదు. ఈ సారి కొత్తగా తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కోకట్ గ్రామ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేశారు.
- మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో...
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 167పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 51,269 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 49,530 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ పరీక్షల విభాగం కన్వీనర్ తెలిపారు. ఘట్‌కేసర్‌లోని శ్రీ చైతన్య జూనియర్‌కళాశాల, రిషి జూనియర్ కళాశాల, వివేకానంద జూనియర్ కళాశాల, శ్రీ భవిత జూనియర్ కళాశాలల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. 8.30 గంటల నుంచేవిద్యార్ధులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లలను ద్విచక్ర వాహనాలపై కేంద్రాలకు తీసుకొచ్చారు.