హరితంవైపు అడుగులు

ABN , First Publish Date - 2021-12-08T04:24:35+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో వచ్చే వాకాలంలో చేపట్టనున్న హరితహారానికి జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఎనిమిదో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు.

హరితంవైపు అడుగులు

  • హరితలక్ష్యం 38.70 లక్షల మొక్కలు 
  •  8వ విడత హరితహార కార్యాచరణ
  •  ప్రభుత్వ శాఖ వారీగా మొక్కల పెంపకం సంఖ్య నిర్ధారణ
  •  లక్ష్య సాధన దిశగా యంత్రాంగాన్ని సిద్ధం చేసిన కలెక్టర్‌
  •  గతం కంటే తక్కువ లక్ష్యం
  •  23 శాఖల భాగస్వామ్యంతో ముందుకు..
  •  ప్రతి మొక్కనూ జియో ట్యాగింగ్‌తో ఉత్తమ ఫలితాలు

వికారాబాద్‌ జిల్లాలో వచ్చే వాకాలంలో  చేపట్టనున్న హరితహారానికి జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఎనిమిదో విడత  తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు. వర్షాలు కురియగానే మొక్కలు నాటాలని, అందుకు ఏర్పాట్లన్నీ చేసుకోవాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్‌ నిఖిల ఆదేశించారు.  ఈసారి భారీ లక్ష్యాలు విధించుకోకుండా గత ఏడాది కంటే తక్కువ లక్ష్యమే నిర్దేశించుకున్నారు. 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌  జిల్లా ప్రతినిధి):జిల్లాలో పచ్చల పండుగకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎనిమిదోవిడతలో భాగంగా వచ్చే ఏడాది వర్షాలు కురియగానే మొక్కలు నాటేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని వివిధ శాఖల అధికారులను  కలెక్టర్‌ ఆదేశించారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను మండలాల వారీగా విభజించి నిర్దేశిత లక్ష్యాలు చేరుకునే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హరితహారంలో భాగంగా ఈసారి భారీ లక్ష్యాలు విధించుకోకుండా గత ఏడాది కంటే తక్కువ లక్ష్యం నిర్దేశించుకున్నారు. గతేడాది జిల్లాలో 40,25,706 మొక్కలు నాటాలని అనుకున్నారు. రానున్న వానకాలం 38,70,705 మొక్కలుగా  లక్ష్యం నిర్దేశించారు. హరితహారంలో 23 ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేయనున్నారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలకూ లక్ష్యాలు కేటాయించారు. ఈ సారి 38.70 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించగా, నాటే వాటిలో కనీసం 85 శాతం మొక్కలు తప్పనిసరిగా బతికే విధంగా పర్యవేక్షించే బాధ్యతనూ శాఖలు, స్థానిక సంస్థలపైనే ఉంచారు.

నర్సరీల్లో లక్ష్యానికి మించి మొక్కల పెంపకం

జిల్లాలో హరితహారానికి లక్ష్యానికి మించే మొక్కలు సిద్ధం చేయనున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో 566 నర్సరీల్లో 97లక్షల మొక్కలను సిద్ధం చేసేలా యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతీ పంచాయతీలో ఒక హరితహార నర్సరీ ఏర్పాటైంది. ప్రతీ నర్సరీలో 15వేల మొక్కలు పెంచాలనే లక్ష్యం నిర్దేశించుకోగా, లక్ష్యానికి 10శాతం మొక్కలను అదనంగా పెంచనున్నారు. 10శాతం మొక్కలు నష్టపోయినా లక్ష్యానికి తగ్గకుండా మొక్కలు నాటేందుకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో అటవీ శాఖకు చెందిన 17 నర్సరీల్లో 8లక్షల మొక్కలు పెంచుతారు. 4 మున్సిపాలిటీల్లోని 18 నర్సరీల్లో వివిధ రకాల 3.22లక్షల మొక్కలు సిద్ధం చేస్తారు. ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా 38,70,705 మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్దేశించుకోగా, 96.12లక్షల మొక్కలను పెంచే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో పంచాయతీల పరిధిలో 25 లక్షల మొక్కలు నాటుతారు. 

నాటిన మొక్కలు బతికితేనే లక్ష్యం సాకారం

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో ఏడేళ్లుగా మొక్కలు నాటుతున్నారు. యేటా కోట్లలో మొక్కలు నాటుతున్నా వాటిల్లో 50శాతం కూడా బతకడంలేదు. మొక్కలు నాటిన శాఖ, సంస్థే సంరక్షణ బాధ్యత కూడా చేపడితేనే  ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. నాటిన మొక్కల ఫొటోతీసి జియో ట్యాగింగ్‌ చేస్తేనే మొక్కల పెరుగుల, అభివృద్ధిపై వివరాలు తెలుస్తాయి. నాటిన మొక్కను ప్రతీ ఆరు నెలలకోసారి ఫొటో తీసి జియోట్యాగ్‌ చేస్తే మొక్క ఎదుగుదలపై స్పష్టత వస్తుంది. సంరక్షణ చర్యలు చేపడితే నాటిన మొక్కల్లో కనీసం 70శాతం మొక్కలైనా బతికి పెరిగితే పచ్చదనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎవెన్యూ ప్లాంటేషన్‌ పెంచాలి

రాబోయే వర్షాకాలంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి సంబంఽధించి శాఖల వారీగా ప్రణాళిక సిద్ధం చేయాలని  కలెక్టర్‌ నిఖిల అధికారులను ఆదేశించారు. 7, 8వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ఆమె వివిధ శాఖల జిల్లా అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విభిన్నంగా చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ప్రధాన రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టి, పచ్చదనం ఉట్టిపడేలా చేయాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, డీఎఫ్‌వో వేణుమాధవ్‌, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీఈవో రేణుకాదేవి, వరప్రసాద్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ తుకారాంభట్‌, తహసీల్లార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:24:35+05:30 IST