ఇష్టారాజ్యం!

ABN , First Publish Date - 2021-08-28T04:29:39+05:30 IST

మేడ్చల్‌ మండలం పూడూరులో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదు. చెరువులు కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలని, బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశాలున్నా అక్రమార్కులు బేఖాతర్‌ చేస్తున్నారు.

ఇష్టారాజ్యం!
పూడూరులో చెరువు కాల్వను పూడ్చి దానిపై వేసిన పైపులు

  •  పూడూరు ఎర్రచెరువులో గోదాంలు
  • బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో  ఇష్టానుసారం నిర్మాణాలు
  • చెరువు కాల్వల పూడ్చివేత
  • ఉనికి కోల్పోతున్న చెరువు
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు


మేడ్చల్‌ మండలం పూడూరులో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదు. చెరువులు కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలని, బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశాలున్నా అక్రమార్కులు బేఖాతర్‌ చేస్తున్నారు. 

మేడ్చల్‌: అధికారుల అలసత్వం.. పాలకుల నిర్లక్ష్యంతో చెరువు జాగాల్లో నిర్మాణాలు  వెలుస్తు న్నాయి. పూడూరులోని సర్వే నంబర్‌ 320లో 43.12 ఎకరాల్లో ఎర్ర చెరువు ఉంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు పూడూరు సమీపంలో ఉండటంతో గ్రామంలో పెద్దఎత్తున గోదాంల నిర్మాణం చేశారు. ఎర్రచెరువు పైభాగం బఫర్‌జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లోనూ గోదాంలు కట్టారు. ఇందు కోసం చెరువు కాల్వలను పూడ్చేశారు. చెరువు పైభాగాన ఉన్న బండ్లకుంట, పందులకుంటలనుంచి చెరువులోకి నీరు చేరుతుంది. కుంటల నాలాలు, ఫీడర్‌ చానెళ్లను మూసివేయడంతో పాటు కొన్ని చోట్ల తాత్కాలికంగా పైపులు వేశారు. ఎర్రచెరువు ముంపు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడట్టడంతో చెరువుకు ఆనుకొని ఉన్న పొలాలు మునుగుతున్నాయి. గతేడాది భారీ వర్షాలకు చెరువు నిండి ఎఫ్టీఎల్‌లో చేపట్టిన గోదాంల్లోకి కూడా నీరు చేరింది. దీనిపై రైతులు కలెక్టర్‌కు, సాగునీటి శాఖ, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చెరువు విస్తీర్ణాన్ని రెవెన్యూ అధికారులు నిర్ధారించాలని సాగునీటి శాఖ అధికారులు..  ఎఫ్‌టీఎల్‌ నిర్ణయించేది ఇరిగేషన్‌శాఖ అని రెవెన్యూ అధికారులు అంటూ చేతులు దులుపుకున్నారు. అధికారుల తీరుతో విసిగిపోయిన రైతులు చేసేది లేక ఎర్ర చెరువును కాపాడాలంటూ కోర్టుకెక్కారు. గ్రామానికి సాగు, తాగునీటినందించే ఎర్రచెరువు బఫర్‌జోన్‌,ఎఫ్‌టీఎల్‌లో చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని, హద్దులు నిర్ణయించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-08-28T04:29:39+05:30 IST