మొలకెత్తిన వడ్లతో రైతుల నిరసన
ABN , First Publish Date - 2021-11-29T05:21:54+05:30 IST
మొలకెత్తిన వడ్లతో రైతుల నిరసన

ఘట్కేసర్: వడ్లు కొనకుండా రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆదివారం ఘట్కేసర్లో రైతులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మొలకెత్తిన వడ్లతో నిరసన వ్యక్తం చేశారు. డీసీఎంలలో తెచ్చిన మొలకెత్తిన ధాన్యంతో రైతులు ఆస్పత్రి నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కర్రె రాజేష్, పాలడుగు అమరేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రైతులు మాట్లాడుతూ యాసంగి సంగతి దేవుడెరుగు.. వానాకాలం పండించిన వడ్లను కొనకుండా ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే క్వింటాళ్లకొద్దీ ధాన్యం బస్తాల్లో, కల్లాల్లో మొలకెత్తి రైతులు నష్టపోయారని తెలిపారు. ‘సీఎం డౌన్‌డౌన్.. వడ్లు కొనకపోవడం సిగ్గుచేటు.. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు నశించాలి.’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వడ్ల బస్తాలతో ఇందిరపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షకు తరలివెళ్లారు. కార్యక్రమంలో సామల అమర్, సుధాకర్, అశోక్, వినోద్, రైతులు పాల్గొన్నారు.