నూనెలు సలసల... గారెలు ఎలా?
ABN , First Publish Date - 2021-01-12T05:44:20+05:30 IST
సంక్రాంతి పండుగకు తెలంగాణలో ఓ ప్రత్యేక స్థానముంది. పంట చేతికి రావడంతో ఆనందంతో బంధు మిత్రులను ఇళ్లకు పిలిచి ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. కూతుళ్లు, అల్లుళ్లను పండుగకు ఆహ్వానిస్తారు. ఈ పండుగకు గారెలు, నాటుకోడి ప్రత్యేక వంటకాలు. కానీ, ఈసారి పండుగకు చాలామంది దూరమయ్యే పరిస్థితులు దాపురిం చాయి.

- భారీగా పెరిగిన వంటనూనె ధరలు
- లీటరు పామాయిల్ ఏకంగా రూ.110
- దరువేస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు
- మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం
సంక్రాంతి పండుగకు తెలంగాణలో ఓ ప్రత్యేక స్థానముంది. పంట చేతికి రావడంతో ఆనందంతో బంధు మిత్రులను ఇళ్లకు పిలిచి ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. కూతుళ్లు, అల్లుళ్లను పండుగకు ఆహ్వానిస్తారు. ఈ పండుగకు గారెలు, నాటుకోడి ప్రత్యేక వంటకాలు. కానీ, ఈసారి పండుగకు చాలామంది దూరమయ్యే పరిస్థితులు దాపురిం చాయి. గారెలు వండుకోవడానికి వాడే వంటనూనెల ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. సామాన్యులు వాటిని కొనే పరిస్థితి లేకుండా పోయింది. లీటరు ఆయిల్ పాకెట్‌కు రూ.30 దాకా ధరలు పెరగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇక, నాటుకోడిపై కూడా భయాందోళనలు నెలకొన్నాయి. దేశంలో బర్డ్‌ఫ్లూ సోకుతుందన్న వార్తలతో నాటుకోడి తినాలంటే కూడా భయపడు తున్నారు. దీంతో ఈసారి సంక్రాంతికి ఆ రెండు ప్రత్యేక వంటలు ప్రజలకు దూరమ య్యేలా కనిపిస్తు న్నాయి.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): సంక్రాంతికి పేదలు సంతృప్తిగా వంటలు చేసుకునే వీలు లేకుండా వంట నూనె ధరలు ఆకాశాన్నంటాయి. బాండలిలో నూనె పోసి మంట వెలిగించిన తరువాత నూనెలు సలసల కాగాల్సి ఉండగా.. పొయ్యి ఎక్కక ముందే ధరలతోనే సలసల కాగుతున్నాయి. సంక్రాంతికి పేదలు పిండి వంటలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. కరోనా ఎఫెక్ట్ , వంట నూనెలు ఉత్పత్తి చేసే దేశాలు విధించిన అధిక పన్నుల ప్రభావంతో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. మూడు నెలల్లోపే సన్ప్లవర్పై కిలోకు రూ. 40, పామాయుయిల్పై రూ.30 పెరిగాయి. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను కేంద్రం నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. దీంతో వంట నూనె... పేదల కంట్లో మంట పెట్టింది. పామాయిల్, సన్‌ప్లవర్, పల్లినూనె.. ఏది చూసినా సలసలా కాగుతున్నాయి.
ప్రజలపై పెనుభారం..
నిత్యావసరాలు, ఆయిల్ ధరల ప్రభావం ప్రజలపై అధికంగా పడింది. వంట నూనెలు నిత్యావసర సరుకు కావడంతో ప్రతి ఒక్కరూ వంట నూనెల ధరలు ఎంత పెరిగినా తప్పనిసరిగా కొనాల్సివస్తోంది. పెరుగుతున్న ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా రాయితీపై అందిస్తున్న సరుకులు ఒక్కక్కటిగా తగ్గించింది. ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు. గతంలో సరఫరా చేసే పామాయిల్, పప్పులు, కారం, పసుపు, చింతపండు తదితర నిత్యావసర సరుకులు ఇవ్వకపోవడంతో జనం బయట మార్కెట్లో కొనాల్సి వస్తుంది. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్యుడికి ఏం తినాలో ఏం కొనాలో తెలియడం లేదు. పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఎందుకిలా ధరల మంట?
దేశంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం అతి తక్కువగా ఉండటంతో వంట నూనెల కోసం ఇతరదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రోజువారీగా వినియోగించే నూనెలు 70 నుంచి 80 శాతానికిపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. పామాయిల్ ఇండోనేషియా, మలేషియా నుంచి సన్‌ప్లవర్ ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి అవుతుండగా. కరోనా ప్రభావం కారణంగా దిగుమతులు తగ్గాయి. దీంతో నూనెల ధరలు భగ్గుమంటున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
నూనె ధరలు విపరీతంగా పెరిగాయి: పి.శైలజ, గృహిణి, చేవెళ్ల
ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎంత ధర ఉన్న కొనక తప్పని పరిస్థితి. ప్రతి నెలా అదనంగా ఖర్చు చేస్తున్నాం. పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పెంచిన నూనె ధరలను తగ్గించాలి.
సంక్రాంతి చేసుకునేటట్టు లేదు: - ఆవుల సత్యమ్మ, బొబ్మిలి గ్రామం,షాబాద్ మండలం
అన్ని ధరలు పెరిగాయి. ఏమి కొనాలో.. ఏమి తినాలో తెలియడం లేదు. వంట నూనె విపరీతంగా పెంచారు. సంక్రాంతి పండగ చేసేటట్టు లేదు. రోజురోజుకూ ధరలు ఇలా పెరిగితే మాలాంటి సామాన్యులు ఎలా బతికేది. సబ్సిడీపై రేషన్‌షాపులో వంట నూనె సరఫరా చేయాలి. పేదలను ప్రభుత్వం ఆదుకోవాలి.