కందిపై కమ్ముకున్న దుమ్ము

ABN , First Publish Date - 2021-12-08T04:34:42+05:30 IST

కందిపై కమ్ముకున్న దుమ్ము

కందిపై కమ్ముకున్న దుమ్ము
మల్కాపూర్‌ సమీపంలో కంది పంటపై దుమ్ము

  •  రైతు ఫిర్యాదు... పరిశీలించిన జిల్లా కాలుష్య  నియంత్రణాధికారులు
  •  కర్మాగారం నుంచి కాలుష్యాన్ని వదలొద్దని యాజమాన్యానికి  ఆదేశాలు

తాండూరు రూరల్‌: ఇండియా సిమెంటు కర్మాగారం నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కంది పంటపై పడి దెబ్బతింటుందని రైతు ఫిర్యాదు మేరకు అధికారుల బృందం పరిశీలించింది. తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన బండవేర అరవింద్‌రావు 9 నెలల క్రితం జిల్లా కాలుష్య నియంత్రణాధికారులకు కర్మాగారం నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళిపై తమ కందిపంట నాశనమవుతుందని ఫిర్యాదు చేశారు. దీంతో  జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ వెంకన్న, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ భవనేశ్వరి మంగళవారం మల్కాపూర్‌ గ్రామ సమీపంలోని బండెవేర్‌ రమే్‌షరావు సాగు చేసిన కంది పంటను పరిశీలించారు. ఏ మేరకు దుమ్ము, ధూళి పంటపై పడుతుందని, ప్రస్తుతం కందిపంట పరిస్థితి ఎలా ఉంది, ఎన్నిఎకరాల్లో కంది పంట సాగు చేశారనే విషయాలపై సమగ్ర వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. అయితే కర్మాగారం వల్ల పంటలపై దుమ్ము పడకుండా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులైన గోపాల్‌, సైదులుకు ఆదేశించినట్లు తెలిపారు. వీరి వెంట రైతులు రమే్‌షరావు, అరవింద్‌రావు, మాజీ ఉపసర్పంచ్‌ హసన్‌అలీ, రైతులు ఉన్నారు. అయితే కాలుష్య నియంత్రణాధికారులు మాత్రం కంది పంటపై పండిన దుమ్మును సక్రమంగా పరిశీలించకుండా రోడ్డు వెంబడి వచ్చి తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లారనిరైతులు ఆరోపించారు. త్వరలోనే    కలెక్టర్‌, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-08T04:34:42+05:30 IST