వరి పండించి నష్టపోవద్దు

ABN , First Publish Date - 2021-12-08T04:27:13+05:30 IST

వరి పండించి నష్టపోవద్దు

వరి పండించి నష్టపోవద్దు
ధారూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ నిఖిల

 ఆరుతడిపంటలే సాగు చేయండి .. కలెక్టర్‌ నిఖిల

ధారూరు: యాసంగిలో వరి పంట సాగు చేసి నష్టపోవద్దని ఆరుతడి పంటలే  సాగు చేసుకోవాలని కలెక్టర్‌ నిఖిల రైతులకు సూచించారు. ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేయడంలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పి నందున రైతులు వరి సాగు చేసి ఇబ్బందులు పడొద్దని ఆమె తెలిపారు. ధారూరులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె రైతులతో మాట్లాడుతూ యాసంగిలో వరి పంటకు బదులుగా రాగి, కుసుమ, మినుము,పెసర, నువ్వులు, వేరుశనగ, జొన్న పంటలను సాగు చేసుకుని లాభం పొందాలని తెలిపారు. ఈ పంటలను మార్క్‌ఫెడ్‌ సంస్థ ద్వారా మంచి ధరలకు కొనుగోలు చేస్తామని చెప్పారు. కాగా తమకు చెరువు కింద భూములు ఉన్నాయని వరి తప్ప  ఇతర పంటలు సాగుకు వీలు కాదని, ఇతర పంటలు వేసినా కోతులు పాడు చేసి నష్టపరుస్తాయని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. కోతుల సమస్య తీరుస్తామని, ఇంటి అవసరాల కోసమే వరి పంటను సాగు చేసుకోవాలని  ఆమె రైతులకు సూచించారు. అంతకుముందు ఆమె  కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని, ప్యాడీ క్లీనింగ్‌ యంత్రం పనితీరును  పరిశీలించి, కొనుగోళ్ల వివరాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లా పౌరసరపరాల అధికారి రాజేశ్వర్‌, జిల్లా మేనేజర్‌ విమల, సర్పంచ్‌ చంద్రమౌళి, ఎఎంసీ వైస్‌ చైర్మెన్‌ ఎ.అంజయ్య,  అధికారులు పాల్గొన్నారు. 

వ్యాక్సినేషన్‌ లక్ష్యం పూర్తి చేయాలి

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌జల్లా ప్రతినిధి) : రాబోయే కొవిడ్‌ ముప్పును నిరోధించేందుకు అర్హులందరికీ వ్యాక్సినేషన్‌ చేసి వంద శాతం లక్ష్యం సాధించాలని కలెక్టర్‌ కె.నిఖిల ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి గూగుల్‌ మీట్‌ ద్వారా వ్యాక్సినేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జడ్పీ సీఈవో, డీపీవో, డీఆర్‌డీవో, వైద్యాఽధికారులు పూర్తి బాధ్యత తీసుకుని గ్రామాల్లో  మిగిలిపోయిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా కృషి చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్‌కు ముందు గ్రామాల్లో, మునిసిపల్‌ వార్డుల్లో దండోరా వేయించాలని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాక్సినేటర్లను వాహనాల్లో తీసుకుని వెళ్లి వ్యాక్సిన్‌ ఇప్పించాలన్పారు. 2వ డోస్‌కు సంబంధించి ఆశ, వీఆర్‌వో, వీఆర్‌ఏ, గ్రామ కార్యదర్శులతో ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించాలన్నారు. 2వ డోస్‌ వ్యాక్సినేషన్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, ఇంత వరకు మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వారం రోజుల్లో వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. 

Updated Date - 2021-12-08T04:27:13+05:30 IST