దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
ABN , First Publish Date - 2021-11-29T05:24:29+05:30 IST
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

- డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్
ఆమనగల్లు: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేశ్ కోరారు. ఆమనగల్లు సమీపంలోని మహేశ్వరి ఇండస్ర్టీ్సలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం గంప వెంకటేశ్ పరిశీలించారు. విక్రయానికి ధాన్యాన్ని తెచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో సేకరిస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రానికి వరిధాన్యం తెస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీఏసీఎస్ సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల, తలకొండపల్లి మండలాల పరిధిలో 13వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల్లో ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సకాలంలో డబ్బు జమచేయనునట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్‌చైర్మన్ దోనాదుల సత్యం, సీఈవో దేవేందర్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి ఎనుముల రమేశ్, రైతులు పాల్గొన్నారు.
తూకాల్లో తేడాలు రాకుండా ధాన్యాన్ని సేకరించండి
మంచాల: తూకాల్లో తేడాలు రాకుండా ధాన్యాన్ని సేకరించాలని జిల్లాపరిషత్ డిప్యూటీ సీఈవో రంగారావు మార్కెట్‌కమిటీ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంచాల, ఆరుట్ల, బోడకొండల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆరుట్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్న డిప్యూటీ సీఈవో రంగారావు ఇక్కడి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తూకాలు జరుపుతున్న తీరును మార్కెట్‌కమిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంచాల, బోడకొండ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు తూకాలు వేయాలంని సూచించారు. రైతులకు అవసరమైన మేరకు బస్తాలను పంపిణీ చేయాలన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
చేవెళ్ల: వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. ఇందిరాపార్కు వద్ద ఆదివారం నిర్వహించిన ధర్నాలో అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడడు పెంటారెడ్డి, చేవెళ్ల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు కరుణాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.
రైతులను ఆదుకోండి
యాచారం: మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు పాడై సర్వస్వం కోల్పోయిన రైతులను ఆదుకోవాలని యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో వరిపంటతో పాటు కూరగాయ పంటలు పాడై రైతులు అప్పుల పాలైనట్లు చెప్పారు. పత్తిపంట కూడా పాడవడంతో రైతులకు అప్పులకుప్ప మిగిలిందని ఆందోళన చెందారు. వరిపంట కోతకోయకముందే పొలంలోనే మొలకెత్తినట్లు చెప్పారు. అనేక గ్రామాల్లో పంటలు పాడైన కారణంగా రైతుల పరిస్థితి దుర్బరంగా మారిందన్నారు. ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు.