టీఆర్‌ఎస్‌ హయాంలో బీసీలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2021-05-02T05:50:09+05:30 IST

టీఆర్‌ఎస్‌ హయాంలో బీసీలకు రక్షణ కరువు

టీఆర్‌ఎస్‌ హయాంలో బీసీలకు రక్షణ కరువు
సమావేశంలో మాట్లాడుతున్న కావలి చంద్రశేఖర్‌

  • మంత్రి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌పై నాయకుల ఆగ్రహం
  • పగ సాధింపు చర్యలతో అణచివేస్తున్నారని సీఎంపై విమర్శలు

కందుకూరు : తెలంగాణలో బీసీలకు రక్షణ కరువైందని, మంత్రి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌ కుట్ర సాధింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి తేరటి లక్ష్మన్‌ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజ్‌ కులస్తులు అధికంగా ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఒక్కరికే మంత్రి పదవిని కేటాయించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ఈటల రాజేందర్‌ ఉన్నట్లు గుర్తించి భూ కుంభకోణంలో ఇరికించారిని ఆరోపించారు.

  • ఈటలపై తప్పుడు ఆరోపణలు సరికాదు

తాండూరు/కొడంగల్‌రూరల్‌: మంత్రి ఈటల రాజేందర్‌ను  భూకబ్జా ఆరోపణలు చేస్తూ పదవి నుంచి తొలగించడాన్ని ఆయా సంఘాలు ఖండించాయి. తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈటల ఉద్యమ కాలం నుంచి తన సొంత ఆస్తులను అమ్ముకుని ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్‌శుకూర్‌, వెంకటేష్‌, లక్ష్మణచారి, రాము, రమేష్‌, బాబాగౌడ్‌, సిద్దన్నగౌడ్‌, సాయి పాల్గొన్నారు. కాగా కొడంగల్‌ ముదిరాజ్‌ యువజన సంఘం అధ్యక్షుడు బాల్‌రాజ్‌ మాట్లాడుతూ తెలంగాణలో వారసత్వ అధికారం కోసం, పేరు కోసం కుట్రపూరిత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీసీ సంఘం తాలూకా అధ్యక్షుడు భీమారాజ్‌, భీంశంకర్‌, వెంకటయ్య, శేఖర్‌, రమేశ్‌బాబు, రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. 

  • ఈటలను పథకం ప్రకారమే ఇరికించారు

ఘట్‌కేసర్‌ రూరల్‌ : మంత్రి ఈటల రాజేందర్‌ను పథకం ప్రకారమే భూకబ్జా విషయంలో ఇరికించారని ముదిరాజ్‌ సంఘం ఎదులాబాద్‌ మాజీ అధ్యక్షుడు, రైతుబంధు సభ్యుడు జవ్వాజీ లింగంముదిరాజ్‌ ఆరోపించారు. బీసీలందరు ఐక్యంగా ఉండి ఈటలకు మద్దతుగా నిలవాలని కోరారు. రాజేందర్‌పై చేసిన ఆరోపణలు సరికావన్నారు. మచ్చలేని ఈటల రాజేందర్‌కు బీసీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని ఆయన కోరారు.

  • టీఆర్‌ఎస్‌ హయాంలో బలహీన వర్గాలకు అన్యాయం 

మొయినాబాద్‌ రూరల్‌: బడుగు, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రజక అభివృద్ధి సంస్థ యువసేన చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు అరవింద్‌ పేర్కొన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఈటల రాజేందర్‌ ఆత్మగౌరవంతో బతుకుతున్న వ్యక్తి అని, అలాంటి వారిపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కార్యక్రమంలో మేడిపల్లి మాజీ సర్పంచ్‌ నవీన్‌, పిరంగి భాస్కర్‌, తదితరులున్నారు.

  • సీఎం కేసీఆర్‌ ఆస్తులపైనా విచారణ చేపట్టాలి 

పరిగి: సీఎం కేసీఆర్‌ ఆస్తులపైనా విచారణ చేపట్టాలని టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.హన్మంత్‌ముదిరాజ్‌, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాల్‌కృష్ణ, జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వర్‌లు వేర్వేరుగా డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు రాచంద్రయ్యయాదవ్‌, ఆంజనేయులు, చిన్ననర్సింహులు, రామకృష్ణ, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

  • కేటీఆర్‌కో న్యాయం... ఈటలకో న్యాయమా?

కడ్తాల్‌: బీసీల్లో బలమైన నాయకుడిగా ఎదిగిన మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ మంత్రి పదవి తప్పించారని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ముదిరాజ్‌ సంఘం జిల్లా నాయకుడు నర్సింహ ఆరోపించారు. కడ్తాలలో శనివారం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. రాజేందర్‌ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఆయనపై భూకబ్జా ఆరోపణలు చేయడంలో సూత్రధారులు, కుట్రధారులెవరో త్వరలోనే తేలుతుందన్నారు. కేటీఆర్‌ భూ ఆక్రమణ చేశారని ఎంపీ రేవంత్‌రెడ్డి రుజువు చేసినా సీఎం కేసీఆర్‌ అతడిని అరెస్ట్‌ చేయకుండా రేవంత్‌రెడ్డిపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారన్నారు.

  • ఉద్యమకారులను అణగదొక్కుతున్నారు

షాబాద్‌ : తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి అహర్నిశలు శ్రమించి, తెలంగాణ రాష్ట్ర సాధనకు కష్టపడిన ఉద్యమనేతపై కుట్రపన్నడం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌ అన్నారు. ఉద్యమం కోసం పోరాడిన బీసీ నేతపై భూకబ్జా ఆరోపణలు చేసి పార్టీ నుంచి సాగనంపేందుకు కేసీఆర్‌ చేస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. దళితుల భూములను కాజేసిన రామేశ్వర్‌రావుపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఫోన్‌కాల్‌లో మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు వస్తే సీఎం కేసీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్‌ చేశాడు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శేఖర్‌, నాయకులు జహంగీర్‌, రవి, పాష, యాదయ్య, లక్ష్మయ్య, శ్రీరాములు తదితరులున్నారు.

Updated Date - 2021-05-02T05:50:09+05:30 IST