సీఎం దీక్ష వల్లే సాగు చట్టాలు రద్దు : ఎంపీపీ
ABN , First Publish Date - 2021-11-22T05:25:30+05:30 IST
సీఎం దీక్ష వల్లే సాగు చట్టాలు రద్దు : ఎంపీపీ

మేడ్చల్ : ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన దీక్ష వల్లే కేంద్రప్రభుత్వం మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుందని మేడ్చల్ మండల పరిషత్ అధ్యక్షురాలు పద్మాజగన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన దీక్షతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు సాగుచట్టాలను రద్దు చేశాడని తెలిపారు. సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేసి మృతిచెందిన 600 మంది రైతుకుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించడం అభినందనీయమని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్‌కు రైతులపట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉచిత విధ్యుత్, రైతుబంధు, రైతు బీమా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. సీఎం చేపట్టిన ధర్నాతోనే కేంద్రం దిగొచ్చిందని, అదే స్ఫూర్తితో ముందుకుసాగితే వడ్లను సైతం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని గుర్తుచేశారు.
‘సాగు చట్టాల రద్దు సీఎం విజయమే’
తాండూరు : కేంద్రప్రభుత్వం వ్యవసాయ(సాగు) చట్టాల రద్దు.. సీఎం కేసీఆర్ విజయమేనని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్ పేర్కొన్నారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో విఠల్‌నాయక్ మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ధర్నా ఫలించిందన్నారు. రైతుల సంక్షేమమే ఽధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ఎక్కడా లేనివిధంగా రైతు బీమా, రైతుబంధు, తదితర పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.