మున్సిపాలిటీలకు మహర్దశ!

ABN , First Publish Date - 2021-12-09T04:38:31+05:30 IST

మున్సిపాలిటీలకు మహర్దశ!

మున్సిపాలిటీలకు మహర్దశ!

తాండూరు : మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా  కేంద్ర ప్రభుత్వం  మరో కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ట్రాన్స్‌ ఫార్మేషన్‌ (అమృత్‌)  పేరుతో దేశ వ్యాప్తంగా అమలు చేయబోతున్న పథకం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు వర్తించనుంది.   దీంతో కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలతో పాటు, పాత మునిసిపాలిటీల దశ మారనుంది. దీంతో మరింత అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈపథకం కింద మున్సిపాలిటీల్లో  అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 25 మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలుకు అడుగులు పడుతున్నాయి. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ ఈ మేరకు బ్యాంకు అకౌంట్‌ల ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది. అమృత్‌ 2.0 పేరిట సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ(ఎ్‌సఎన్‌ఏ) పేరిట అకౌంట్‌ను తెరిచేందుకు ఆదేశిలిచ్చారు. అమృత్‌ పథకం అమలు అయితే ఐదేళ్లకాలంలో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో  తాగునీరు, మురుగునీటిపారుదల, పాఠశాలల అభివృద్ధి(పచ్చదనం), రోడ్లు, పారిశుధ్యం పనులు చేపట్టనున్నారు. కొత్త మున్సిపాలిటీల లో ప్రధాన సమస్యలు విద్యుత్‌, తాగునీరు,  డ్రైనేజీ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం లభించనుంది.  

నిధులు ఇలా...

 వందశాతం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా 50 శాతం నిధులను మున్సిపాలిటీలకు సంబంధించిన ఎకౌంట్లలో జమ చేస్తుంది. రాష్ట్రప్రభుత్వం వాటా కింద 20శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. మిగతా 30 శాతం నిధులు మునిసిపాలిటీలు భరించాల్సి ఉంది.  అయితే ఈ 30శాతం నిధులను మున్సిపాలిటీలు భరించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.   ఉమ్మడి జిల్లాలో ఆర్థికంగా ఉన్న మున్సిపాలిటీలు  అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే  ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నివేదించాల్సి ఉంటుంది.

 అమృత్‌ అమలయ్యే మున్సిపాలిటీలు

వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, పరిగి మున్సిపాలిటీలు,  రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్‌, షాద్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట్‌, ఇబ్రహీంపట్నం, జాల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయాంజల్‌, మనికొండ, ఆమనగల్లు, ఆదిభట్ల, శంకర్‌పల్లి, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో మేడ్చల్‌, దుండిగల్‌, గుండ్లపోచంపల్లి, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్‌ తుంకుంట, కొంపల్లి మున్సిపాలిటీల్లో  అమృత్‌  పథకం అమలు కానుంది.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట: మౌలిక సదుపాయాలకు పెద్దపీట:-అశోక్‌కుమార్‌, ఇన్‌చార్జి కమిషనర్‌, తాండూరు మున్సిపాలిటీ

 గతంలో సెలెక్టెడ్‌ మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. ఈసారి శానిటేషన్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన మున్సిపాలిటీలకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి గైడ్‌లైన్స్‌ రాలేదు. అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (అమృత్‌) పథకం ద్వారా పట్టణంలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీం ద్వారా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది.

పట్టణాభివృద్ధికి కేంద్రం నిధులు:  సింధుజ, బీజేపీ ఫ్లోర్‌లీడర్‌, తాండూరు మున్సిపాలిటీ

అమృత్‌ స్కీంతో పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులతో పట్టణ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్రం 50శాతం నిధులు నేరుగా మున్సిపాలిటీలకు అందించనుంది. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కేంద్ర ఇచ్చే నిధులను సమస్యల పరిష్కారానికి వెచ్చించేలా చూడాలి.

Updated Date - 2021-12-09T04:38:31+05:30 IST