మళ్లీ వీరికే చాన్స్‌

ABN , First Publish Date - 2021-11-22T05:04:04+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను

మళ్లీ వీరికే చాన్స్‌

  • మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు పేర్లు ఖరారు
  • ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నేడు నామినేషన్లు 


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. ‘ఆంధ్రజ్యోతి’ ఊహించినట్లే సిట్టింగ్‌లకే టికెట్‌ ఖరారు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు పోటీ చేయనున్నారు. సోమవారం వారు నామినేసన్లు వేయనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి సిట్టిం గ్‌లకే అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ కోటా కింద ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజుల పేర్లను పార్టీ అధినాయకత్వం ఆదివారం ఖరారు చేసింది. వీరిద్దరూ సోమ వారం నామినేషన్లు వేయ నున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల కోటా కింద జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల్లో అధికార టీఆర్‌ఎస్‌పార్టీకి తిరుగులేని ఆధిక్యత ఉండడంతో రెండు స్థానాలు కైవసం చేసుకోవడం నల్లేరుపై నడకేనని చెప్పాలి. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు ఇంకా అభ్యర్థుల ఖరారు విషయంలో ఇంకా తర్జనభర్జనలు పడు తున్నాయి. అయితే పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ తరఫున అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డిని పోటీకి దింపాలని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక ఓటు తమసంఘం తరఫున బరిలో దిగుతున్న చింపులకు వేస్తామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ కూడా చింపులకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు ఈ రెండు స్థానాలు ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పంచాయతీరాజ్‌ సంఘం తరఫున చింపుల సత్యనారాయణను రంగంలో దింపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ సంఘంలో సభ్యులు ఒక ఓటు చింపులకు వేసేందుకు నిర్ణయిస్తే అధికార పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం గెలుపుపై ధీమాతో ఉంది. ఇదిలాఉంటే అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు శంభీపూర్‌ రాజు, మహేందర్‌రెడ్డిలు సోమవారం నామినేషన్లు వేయనున్నారు. దీనికి ముందుగా మంత్రి సబితారెడ్డి ఇంట్లో సమావేశమై అక్కడ నుంచి నామినేషన్లు వేసేందుకు వెళ్లనున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న శంభీపూర్‌ రాజుకు మరోసారి పార్టీ అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్‌కు విశ్వాస పాత్రునిగా ఉన్న శంభీపూర్‌ రాజుకు మరోసారి పొడిగింపు ఉంటుందని ముందునుంచే ప్రచారం జరిగింది. అలాగే మాజీ మంత్రి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి కూడా మరో చాన్స్‌ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ నుంచే బరిలో దిగాలని భావిస్తున్న మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ణ్యా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 


ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌లైన మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజులకే అధికార టీఆర్‌ఎస్‌ మరో అవకాశం ఇవ్వనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే వెల్లడించింది. ఈనెల 10వ తేదీన ‘మళ్లీ వారిద్దరికే చాన్స్‌’ అనే శీర్షికతో వార్త కథనం ప్రచురించింది. చివరికి ఇదే నిజమైంది. ఊహించినట్లే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. 

Updated Date - 2021-11-22T05:04:04+05:30 IST