రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులపై కేసు
ABN , First Publish Date - 2021-05-25T04:27:33+05:30 IST
రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులపై కేసు

కీసర రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్‌ఆర్ రోడ్డులో ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైన రైతులపై కేసు నమోదు చేసినట్లు సోమవారం కీసర ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్పకు చెందిన యువకులు ఆదివారం రాత్రి శామీర్‌పేట నుంచి యాద్గార్‌పల్లి మీదుగా తమ బైక్‌పై ప్రయాణిస్తున్నారు. రాత్రి కావడంతో ధాన్యం కుప్పలను గమనించకుండా ఢీకొట్టారు. వారికి తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదు మేరకు యాద్గార్‌పల్లికి చెందిన ఎనిమిది మంది రైతులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రైతుల వివరణ తీసుకున్న అనంతరం తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేయనున్నట్లు వివరించారు. ఇకముందు ఎవరైనా సర్వీస్ రోడ్డుపై ధాన్యం ఆరబెట్టి, రోడ్డుప్రమాదాలకు కారకులైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.