అదృశ్యమైన బాలుడు శవమై తేలాడు
ABN , First Publish Date - 2021-01-21T05:02:50+05:30 IST
అదృశ్యమైన బాలుడు శవమై తేలాడు

- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబల్‌నాయక్, ఏసీపీ కుషాల్కర్
కొత్తూర్: మురుగునీటి గుంతకు సైడ్‌వాల్స్ లేకపోవడంతో ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు అందులో పడి మృతిచెందగా వారం రోజుల తర్వాత బుధవారం ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పరూఖ్‌నగర్ మండలం మెల్లగూడ తండాకు చెందిన నందు(11) తన నానమ్మ చౌలీతో కలసి ఈ నెల 13న జేపీ దర్గాకు వచ్చారు. నానమ్మ కూరగాయలు కొంటున్న సమయంలో నందు ఆడుకుంటూ వెళ్లి మురుగునీటి గోతిలో పడిపోయాడు. నందు కోసం చౌలీ వెతికినా కన్పించలేదు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం స్థానికులు గోతిలో బాలుడి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇన్‌స్పెక్టర్ భూపాల్‌శ్రీధర్ మృతదేహాన్ని వెలికి తీయించి నందుదిగా గుర్తించారు. వక్ఫ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో కొడుకు మృతిచెందాడని నందు తల్లిదండ్రి అందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబల్‌నాయక్, ఏసీపీ కుషాల్కర్, ఇన్ముల్‌నర్వ సర్పంచ్ అజయ్‌మిట్టు బాధితులను పరామర్శించారు. వక్ఫ్ బోర్డ్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నందు సోదరుడు శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నందు మృతి మిస్టరీ ఛేదించాలని రాంబాల్‌నాయక్ పోలీసులను కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.