సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-11-24T04:46:53+05:30 IST

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆదిభట్ల: బాలుడికి బ్యాడ్జి అందజేస్తున్న సీఐ నరేందర్‌

చేవెళ్ల/ఆదిభట్ల/యాచారం/మాడ్గుల: విద్యార్థులు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల సీఐ విజయ్‌ భాస్కర్‌రెడ్డి సూచించారు. చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో మంగళవారం సైబర్‌ యంగిస్తాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలన్నారు. అనంతరం సైబర్‌ అంబాసిడర్‌ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థులు మనుశ్రీ, శ్రీనిధిలను ఎంపిక చేశారు. వీరికి పది నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షీటీం ఏఎస్‌వో పద్మ, ప్రిన్సిపాల్‌ టేనావతి, ఎంఈవో ఆక్బర్‌, షీటీం సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీ పటేల్‌గూడ ఉన్నత పాఠశాలలో సైబర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరేందర్‌ విద్యార్థులు సూచనలు చేశారు. జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలల్లో సైబర్‌ అంబాసిడర్‌ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గోవర్దన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండలంలోని గున్‌గల్‌ మోడల్‌ పాఠశాలలో సీఐ లింగయ్య అవగాహన కల్పించారు. ఎంఈవో రామానుజన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ఏమీమా పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గులలో సీఐ డి.కృష్ణమోహన్‌ ప్రజలు సైబర్‌ నేరాల పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్‌ నేరగాళ్ల బారిన పడితే తక్షణమే 1552260 లేదా 100 నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-11-24T04:46:53+05:30 IST