పరిహారం జాడేది?

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

సాగునీటి కాలువ నిర్మాణంతో భూములకు నీరందుతుందని రైతులు భూముులిచ్చారు.

పరిహారం జాడేది?

  • కేఎల్‌ఐ డి-82 కెనాల్‌కు రైతుల భూమి సేకరణ
  • పరిహారం కోసం సింగంగపల్లి, పోలెపల్లి నిర్వాసితుల ఎదురుచూపు
  • ఐదేళ్లుగా పూర్తికాని కాలువ.. అందని నీరు
  • 283 మంది రైతులకు నిలిచిన రైతుబంధు
  • ఉద్యమాలకు సిద్ధమవుతున్న అన్నదాతలు


సాగునీటి కాలువ నిర్మాణంతో భూములకు నీరందుతుందని రైతులు భూముులిచ్చారు. పరిహారం తేల్చకుండానే ప్రభుత్వం కెనాల్‌ తవ్వింది. ఐదేళ్లవుతున్నా కాలువ పూర్తికాక నీరు రావడం లేదు. భూములకు సైతం పరిహారం రాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల్లో భాగంగా 2017లో చేపట్టిన డి-82 కెనాల్‌కు భూమి కోల్పోయిన సింగంగపల్లి, పోలెపల్లి రైతుల పరిస్థితి ఇది. కాలువకు పోగా మిగిలిన భూములకూ రైతుబంధు నిలిపివేశారు. సమస్యను పరిష్కరించాని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేక రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు.


ఆమనగల్లు: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి-82 కాలుక కోసం భూములు కోల్పోయిన ఆమనగల్లు మండలం పోలెపల్లి, సింగంపల్లి గ్రామాల రైతులకు పరిహారం రాలేదు. కాల్వకు పోగా మిగిలిన భూములకూ రైతుబంధు ఇవ్వడం లేదు. భూసేకరణ చేపట్టకుండానే తమ భూముల నుంచి కాలువ తీశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూ సేకరణ పరిహారానికి నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సర్వే నెంబర్ల వారీ రైతుల నివేదిక ప్రభుత్వానికి పంపారు. కేఎల్‌ఐలో భాగంగా వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల్లోని 35వేల ఎకరాలకు నీరిచ్చేలా 2017లో డి-82 కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.178కోట్లు విడుదల చేశారు. జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు కాల్వ నిర్మాణం చేపట్టారు. ఆమనగల్లు మండలం పోలెపల్లి, సింగంపల్లి పరిధిలో 8కిలోమీటర్ల మేర పట్టా భూముల్లో కాలువ తీశారు. 90శాతం పనులు పూర్తయ్యాయి. నిధులు విడుదల కాక, కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం, కొన్ని చోట్ల భూ వివాదాలతో కాలువ నిర్మాణ పనులు చివరి దశలో నిలిచిపోయాయి.


  • 94.09ఎకరాలు కోల్పోయిన 283 మంది రైతులు

డి-82 కెనాల్‌ కోసం పోలెపల్లిలో 142 మంది రైతులు 59.24ఎకరాలు, సింగంపల్లి 141మంది రైతుల 35.25ఎకరాలు కోల్పోయారు. ఏడాదిలోపే ఈ రెండు గ్రామాల్లో 95శాతం కాలువ పని పూర్తిచేశారు. అయితే వారికి పరిహారం మాత్రం ఇవ్వలేదు. భూములు కోల్పోయిన వారు సన్న, చిన్న కారు రైతులే.


  • ఎకరానికి రూ.8లక్షల పరిహారంగా నిర్ణయం

కేఎల్‌ఐ డి-82కు కోల్పోయే పట్టా భూములకు ప్రభుత్వం ఎకరానికి రూ.8లక్షలుగా పరిహారం నిర్ణయించింది. కాలువ నిర్మాణం 2017లోనే చేపట్టినా 2019లో కొలతలు వేసి రైతుల వారీ నిర్వాసితుల వివరాలు సేకరించారు. రైతుల బ్యాంక్‌ ఖాతా  నెంబర్లు సేకరించారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని భూ సేకరణ అధికారులు, ఆర్డీవో పేర్కొన్నారు. అయితే నేటికీ పరిహారం అందలేదు.

  • ఎవరూ పట్టించుకోవడం లేదు... : జగ్‌రామ్‌, రైతు, పోలెపల్లి 


కేఎల్‌ఐ డి-82 కాలువకు భూమి  కోల్పోయిన మాకు 2017 నుంచీ ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మాకే సాగునీరొస్తుందని కాల్వ నిర్మాణానికి సహకరించాం. పనుల పూర్తి చేసి, పరిహారం పంపిణీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.


  • రైతులకు న్యాయం చేసేంత వరకూ పోరాడుతాం : కండె హరిప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ, ఆమనగల్లు


డి-82 కాలువకు భూసేకరణ చేయకుండానే రైతుల భూముల్లో కాలువ తవ్వారు. ఐదేళ్లయినా నీరు రాలేదు. రైతులకు పరిహారం కూడా ఇవ్వలేదు. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోగా మిగిలిన భూమికీ రైతుబంధు నిలిపేయడం అన్యాయం. రైతులకు న్యాయం జరిగేంత వరకూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.


Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST