విస్తరణకు నోచని ఆమనగల్లు బస్టాండ్‌

ABN , First Publish Date - 2021-05-09T05:11:07+05:30 IST

విస్తరణకు నోచని ఆమనగల్లు బస్టాండ్‌

విస్తరణకు నోచని ఆమనగల్లు బస్టాండ్‌
ఆమనగల్లులోని ఆర్టీసీ బస్టాండ్‌

  •  సదుపాయాల లేమితో ప్రయాణికుల ఇబ్బందులు 
  •  ప్లాట్‌ఫారాలు లేక ఏ బస్సు ఎక్కడ నిలుస్తుందో తెలియని వైనం 
  •  అధికారుల అలసత్వం.. పట్టింపులేని ప్రజాప్రతినిధులు

ఆమనగల్లు : రాష్ట్ర రాజధానికి చేరువలో, నాలుగు మండలాలకు కూడలిగా శ్రీశైలం-హైద్రాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్‌లో సరైన వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందల బస్సులు, వేలమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్‌, 18ఏళ్లుగా విస్తరణకు నోచుకోవడం లేదు. కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు ప్రధాన ఆదాయ మార్గమైన ఆమనగల్లు బస్టాండ్‌ అభివృద్ధి, ప్రయాణికులకు వసతుల కల్పనలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. బస్టాండ్‌ ఏటేటా వ్యాపార సముదాయంగా మారుతోంది. ఇప్పటికే దుకాణాల నిర్మాణంతో బస్టాండ్‌ ఆవరణ పూర్తిగా కుచించుకుపోయింది. ఆర్టీసీ అధికారులు ఆదాయంపై చూపుతున్న శ్రద్ధ వసతుల కల్పనపై చూపడం లేదని ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు. ఆమనగల్లు బస్టాండ్‌ను విస్తరించి సదుపాయాలు కల్పించాలన్న ప్రయాణికుల విన్నపాలకు ఏళ్లకాలంగా మోక్షం లభించడం లేదు. 

  • బస్టాండ్‌లో కనీస వసతులు కరువు

2003లో ప్రారంభించిన ఆమనగల్లు బస్టాండ్‌లో నేటికీ సరైన వసతులు సమకూర్చకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. బస్టాండ్‌లో కనీసం క్యాంటీన్‌ సదుపాయం కూడా లేదు. ప్రయాణికులకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా ఏర్పాటు చేయలేదు. బస్టాండ్‌ విస్తరణ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోడం లేదని ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లు బస్టాండ్‌ మీదుగా హైద్రాబాద్‌, శ్రీశైలం, యాదగిరిగుట్ట దేవరకొండ, అచ్చంపేట, సంగారెడ్డి, షాద్‌నగర్‌, వరంగల్‌, మాల్‌, ఇబ్రహీంపట్నం, నర్సంపేట, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ తదితర సుదూర ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంక్షేమమే తమ ధ్యేయమని గొప్పగా ప్రకటించుకునే ఆర్టీసీ అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదనడానికి ఆమనగల్లు బస్టాండ్‌ నిదర్శనంగా నిలిచింది. 

  • తాగునీటి కోసం ప్రయాణికుల వెతలు

బస్టాండ్‌లో తాగునీటి వసతి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అసలే ఎండలు మండిపోతుండడంతో ప్రయాణికులు అల్లాడుతున్నారు. విధిలేక వాటర్‌ ప్యాకెట్లు, బాటిల్స్‌ కొనుక్కోవాల్సి వస్తోంది. కాగా బస్టాండ్‌లో వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్మించిన మినీ వాటర్‌ట్యాంక్‌కు కుళాయి కనెక్షన్‌ తొలగించడంతో నిరూపయోగంగా మారింది. ప్లాట్‌ఫారాలు తగినన్ని లేకపోవడంతో ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు అయోమయానికి గురౌతున్నారు.

  • పార్కింగ్‌ అడ్డాగా బస్టాండ్‌ ఆవరణ

ఆర్టీసీ బస్టాండ్‌ వాహనదారులకు పార్కింగ్‌ అడ్డాగా మారింది. చాలామంది ద్విచక్రవాహనదారులు బస్టాండ్‌ ఆవరణలోనే వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. అసలే ఇరుకుగా ఉన్న బస్టాండ్‌ ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్‌ చేస్తుండడంతో బస్సుల రాకపోకలకు మరిన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. బస్టాండ్‌లో పార్కింగ్‌ టెండర్‌ నిర్వహించిన ఆర్టీసీకి ఆదాయం సమకూరడంతో పాటు ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్‌ చేయకుండా నిలువరించే అధికారం ఉంది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు.

  • కళాహీనంగా ప్రధాన ద్వారం

శ్రీశైలం-హైద్రాబాద్‌ జాతీయ రహదారిని అనుసరించి ఉన్న బస్టాండ్‌ ముందు భాగంలో రోడ్డు కంకర తేలి పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా బస్టాండ్‌ కళాహీనంగా కన్పిస్తుంది. బస్టాండ్‌, జాతీయ రహదారి మధ్య సరిపడా సీసీ రోడ్డు వేస్తే రాకపోకలకు ఇబ్బందులు తొలుగుతాయి. అలాగే రాజీవ్‌ కూడలి నుంచి షాద్‌నగర్‌ రోడ్డు వైపు బస్టాండ్‌ నుంచి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా ఉంది.  

  • వ్యాపార సముదాయంగా బస్టాండ్‌

ఆమనగల్లు బస్టాండ్‌ వ్యాపార సముదాయంగా మారింది. పట్టణం నడిబొడ్డులో ఎంతో విలువైన స్థలంలో ఉన్న బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే సగ భాగానికిపైగా దుకాణ సముదాయాలు నిర్మించి అద్దెకిచ్చారు. దీంతో బస్టాండ్‌లో స్థలం ఇరుకుగా మారి బస్సులు కదలలేని పరిస్థితి నెలకొంది. ఇదిలావుంటే మరో ఆరు దుకాణాలు, పార్కింగ్‌ స్థలం ఏర్పాటుకు టెండర్లు జారీచేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులకు వసతులు కల్పించాలి

బస్టాండ్‌లో ప్రయాణికులకు సరైన వసతులు కల్పించాలి. బస్టాండ్‌ను వెంటనే విస్తరించాలి. జాతీయ రహదారిపై ఉన్న బస్టాండ్‌లో కనీస వసతులు లేవు. బస్టాండ్‌ అబివృద్ధికి ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకోవాలి. రెండు ప్రధాన ద్వారాల ఎదుట కంకర తేలిన రోడ్డుపై సీసీ ఏర్పాటు చేయాలి.

-కృష్ణనాయక్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు, ఆమనగల్లు 


తాగునీటి వసతి కల్పించాలి

బస్టాండ్‌లో తాగునీటి వసతి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లకాలంగా సమస్య ఎదురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బస్టాండ్‌లో నీటివసతి కల్పించి వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. క్యాంటీన్‌ ఏర్పాటుచేసి ప్రయాణికలు కూర్చోడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలి. అలాగే పార్కింగ్‌ స్థలం, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి.

- సింగిడి రామస్వామి, ప్రయాణికుడు, శెట్టిపల్లి


ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

బస్టాండ్‌ విస్తరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. బస్టాండ్‌లో మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించి అధికారుల దృష్టికి తీసుకుపోయాం. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సహకారంతో బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలు, విస్తరణ గురించి మంత్రి, ఉన్నతాధికారులను కలిశాం. బస్టాండ్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.

- అనురాధాపత్యనాయక్‌, జడ్పీటీసీ, ఆమనగల్లు

Updated Date - 2021-05-09T05:11:07+05:30 IST