వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
ABN , First Publish Date - 2021-12-10T05:08:43+05:30 IST
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

వికారాబాద్/మోమిన్‌పేట/దోమ : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సూచించారు. గురువారం స్థానిక డీపీఆర్‌సీ భవనంలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగుపై అవగాహన కార్యక్రమం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. యాసంగిలో పండించే వరి పంటలను కేంద్రప్రభుత్వం, భారత ఆహార సంస్థలు కొనుగోలు చేయవని స్పష్టంగా తెలిపినందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకొనేలా క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. దీనికి బదులు పామ్‌ఆయిల్ పంట చాలా లాభదాయకమని ఆయన తెలిపారు. అతి త్వరలో జిల్లాలో పామ్ ఆయిల్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. దీంతో పాటు జనవరి మాసం వరకు జొన్న, పెసర, మినుములు, నువ్వుల పంటలను వేసుకొనేందుకు వీలు పడుతుందన్నారు. అందరూ ఒకే రకం పంట కాకుండా వేర్వేరు పంటలు పండించుకుంటే లాభదయకమన్నారు. ప్రతి సారి ఒకే పంట పండిస్తే భూసారం తగ్గుతుందని, దీంతో అధిక లాభాలు చేకూరుతాయన్నారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనలమేరకు ఇప్పటివరకు ఎవరూ కూడా వరి నారు వేయలేదని తెలిపారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 70వేల ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందని, బొంరాస్‌పేట మండలంలో ఎక్కువగా 10వేల ఎకరాలలో సాగు చేయడం జరిగిందన్నారు. ఈ 70 వేల ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామం, హాబిటేషన్‌లలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, వ్యవసాయ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు నష్టపోకుండా ప్రజాప్రతినిదులు అధికారులు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, అదనపు కలెక్టర్ మోతీలాల్, వ్యవసాయశాఖ అధికారి గోపాల్, వ్యవసాయ అధికారులు, హర్టికల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతుబంధు మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు సాగు చేయాలి
యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మోమిన్‌పేట మండలం టేకులపల్లి క్లస్టర్ ఏఈవో నీరజ అన్నారు. ఎన్కతల గ్రామంలో ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. యాసంగిలో ఆరుతడి పంటలైన కూరగాయలు, పప్పుదినుసులు, జొన్నలు, గోధుమలు, సోయా వంటి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. ఆరుతడి పంటల్లో ఎన్నో రకాలుంటాయని, ప్రత్యామ్నాయ పంటలతో అధిక లాభాలు వస్తాయని వివరించారు. రైతులు యాజమాన్య పద్దతులు అవలంభిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగాద దోమ మండల పరిఽధిలోని బ్రాహ్మన్‌పల్లి గ్రామంలో యాసంగిలో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ఏఈవో బాబ్య రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాఘవేందర్‌రెడ్డి, పెంటయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.