కేటాయింపు లిస్టు లీక్‌..?

ABN , First Publish Date - 2021-12-31T04:44:43+05:30 IST

ఉపాధ్యాయ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎంతో పకడ్బందీగా కొనసాగుతోంది.

కేటాయింపు లిస్టు లీక్‌..?
ఉపాధ్యాయులను కలెక్టరేట్‌లోకి రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు

  • ఒక చోటకు ఆప్షన్‌ పెట్టుకుంటే..మరోచోటకు ఎలా వేస్తారు?
  • కౌన్సెలింగ్‌ వద్దకు వచ్చి గొడవకు దిగిన కొందరు ఉపాధ్యాయులు
  • కేటాయింపు లిస్టు లీకుపై ఆరా తీసిన కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
  • ఉపాధ్యాయ సంఘాల నేతలపై సీరియస్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉపాధ్యాయ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎంతో పకడ్బందీగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ కౌన్సెలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా కలెక్టరేట్‌లోనే ఉండి కౌన్సెలింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ప్లేస్‌ కేటాయింపు ప్రక్రియ బుధవారం రాత్రి కూడా కొనసాగింది. సబ్జెక్టుల వారీగా ప్లేస్‌ కేటాయింపు చేశారు. పీహెచ్‌సీ 70, ఎమ్మార్‌, వితంతు (కారుణ్య నియామకం వారికి) హెల్త్‌ గ్రౌండ్‌ వారికి కేటాయింపులో ప్రాధాన్యమిచ్చారు. ప్లేస్‌ కేటాయింపు పూర్తయిన జాబితాను అక్కడ ఓ ఉపా ధ్యాయ సంఘానికి చెందిన నాయకులు ఫోటో తీసి బయకు లీక్‌ చేశారని సమాచారం. దీంతో బయట నుంచి కొందరు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ జరుగుతున్న చోటుకు చేరుకుని నేను ఆప్షన్‌ ఒకదగ్గర పెట్టుకుంటే.... నాకు మరో ప్రాంతంలో ఎలా కేటాయిస్తారంటూ ఉపాధ్యాయులు ప్రశ్నించారని తెలిసింది. కేటాయింపు లిస్టు బయటకు లీకైన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఉపాధ్యాయ సంఘాల నేతలపై సీరియస్‌ అయ్యారని సమాచారం. లీక్‌ విషయంపై ఆరా తీశారని తెలిసింది. అందరి సెల్‌ఫోన్స్‌ చెక్‌ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియను స్టాప్‌ చేయించినట్లు తెలిసింది. ఎస్‌జీటీ పోస్టులకు నేడు ఉదయం పది గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమై సాయంత్రం ముగియనుంది. ఇది మొత్తం ప్రక్రియ ముగిసినట్టే. ఇక టీచర్లు వారికి కేటాయించిన పాఠశాలకు వెళ్లి జాయినింగ్‌ అయి విధులు నిర్వహించాల్సిందే. 



Updated Date - 2021-12-31T04:44:43+05:30 IST