ఆశలన్నీ కందిపైనే..

ABN , First Publish Date - 2021-11-22T05:23:18+05:30 IST

ఆశలన్నీ కందిపైనే..

ఆశలన్నీ కందిపైనే..
చేవెళ్లలో సాగైన కంది పంట

  • ఆశాజనకంగా సాగు 
  • పూత, కాత దశలో కంది పంట
  • అధికారులు అవగాహన కల్పించడం లేదని రైతుల ఆరోపణ 


చేవెళ్ల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయానికి వర్షాలు కురువడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మొక్కజొన్న, వరి పంటలు చేతి వస్తున్నాయి.  వీటితో పాటు కందిసైతం కాత దశకు చేరుకుంది. వానాకాలం ప్రారంభం నుంచి భారీ వర్షాల మూలంగా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో వరి, పత్తి మొక్కజొన్న తదితర పంటల దిగుబడి కొంత తగ్గింది. ఈ పంటలతో సమానంగా సాగుచేసిన కంది పంట అన్ని ఒడిదొడుకులను తట్టుకొని పూత, కాత దశలో ఉంది. ప్రస్తుతం కందిపంట ఆశాజనకంగా కనిపిస్తోంది. దీంతో రైతులు కందిపై ఆశలు పెట్టుకొని పంటను కంటికిరెప్పలా కపాడుకుంటున్నారు. 

డివిజన్‌లో ఆశాజనకంగా కందిసాగు.. 

 చేవెళ్ల డివిజన్‌లో ఈఏడాది వానాకాలం సీజన్‌కు రైతులు కంది పంటను అధికంగానే సాగు చేశారు. చేవెళ్ల మండలంలో 5760 ఎకరాలు, షాబాద్‌లో 4396, శంకర్‌పల్లిలో 3462, మొయినాబాద్‌లో 2634 ఎకరాల్లో రైతులు కందిపంటను సాగుచేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు పత్తి, కూరగాయల పంటల్లో సైతం రైతులు అంతర పంటగా కందిసాగు చేశారు. ప్రస్తుతం కందిపంట పూత, కాత దశలో ఉంది. రైతులు పంటను చీడపీడల నుంచి కాపాడుకోవడానికి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. అధికవర్షాల మూలంగా మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటల దిగుబడి తగ్గడంతో రైతులు కందిపంటపై ఆశలు పెట్టుకున్నారు. 

మద్దతు ధరతో పెరిగిన ఆశలు 

 పత్తి, వరి, మొక్కజొన్న పంటల సాగుచేసి పెట్టుబడి నష్టాలు పూడ్చడానికి కంది పంటపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వం మద్దతుధర సైతం ఎక్కువగా  కల్పించడంతో దిగుబడి పెంచుకునేందుకు రైతులు అన్నిచర్యలు తీసుకుంటున్నారు. పంటకు సకాలంలో క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తూ పంటను కాపాడుకుంటున్నారు. గత ఏడాది ప్రభుత్వం మద్దతు ధర రూ.5800 ఉండగా, ఈ ఏడాది రూ.6300 ప్రకటించారు. పత్తిపంట కన్నా కందికి ఎక్కువధర వస్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా కందుల కొనుగోలు కేంద్రాలను తొందరగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు రైతులు ఆభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్‌ శాఖ అఽధికారులు, మార్కెటింగ్‌ పాలకవర్గం కమిటీచర్యలు తీసు కోవాలని ఆయా గ్రామాల రైతులు సూచిస్తున్నారు.

పచ్చపురుగుతో జాగ్రత్త అవసరం 

కంది మొగ్గ, పూతదశలో ఉండటంతో పంటపై పచ్చపురుగు ఉధృతి పెరిగిపోతోంది. ఆకులను గూళ్లుగా కట్టుకొని పంటపై దాడులు చేస్తున్నాయి. రోజురోజుకు పూతరాలడం ఎక్కువకావడంతో కందికర్రలు మోడువారుతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనికితోడు చలి తీవ్రత పెరగడంతో చీడపీడల ఉధృతి మరింత పెరిగే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే క్రిమిసంహారక మందులను పిచికారి చేసినా ఫలితం కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక దిగుబడిపై ఆశలు పెట్టుకున్న రైతులు పెట్టుబడులు వస్తాయోలేదో అని ఆందోళన చెందుతున్నారు. అంతర పంటగా సాగు చేసిన కంది పంట పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపిస్తున్నా విడిగా సాగుచేసిన పంటలపై పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. 

అవగాహన కల్పించని అధికారులు 

 రైతులకు సకాలంలో అవగాహనతో పాటు సలహాలు ఇస్తామని ప్రకటనలు చేసే వ్యవసాయ శాఖ అధికారుల జాడమాత్రం గ్రామాల్లో ఎక్కడా కనిపించడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కార్యాలయాలకే పరిమితమై చుట్టపుచూపుగా మాత్రమే గ్రామాల్లోకి వచ్చి వెళ్తున్నారని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. కందిపైర్లు కాపాడుకునేందుకు రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి కనీసం సలహాలు ఇవ్వాలని ఆయా గ్రామాల రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. 

కందిపంటపైనే ఆశలు పెట్టుకున్నాం : వి.లింగాచారి, రైతు, మల్కాపూర్‌

అధిక వర్షాల వలన పంటలన్నీ దెబ్బతిన్నాయి. నేను రెండు ఎకరాల్లో కంది పంట వేశాను. ప్రస్తుతం పంట పూత, కాత దశలో ఉంది. అధికవర్షాల వలన పత్తి, మొక్కజొన్న పంటల దిగుబడి తగ్గింది. వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా కంది పంటను చీడపీడల నుంచి కాపాడుకు నేందుకుగాను తగు సూచనలు అందించాలి. 

Updated Date - 2021-11-22T05:23:18+05:30 IST