వేగవంతం
ABN , First Publish Date - 2021-10-30T04:17:23+05:30 IST
వేగవంతం

- కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే
- భూసేకరణలో నిమగ్నమైన అధికారులు
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతా ప్రజలకు భవిష్యత్తులో నీటిఎద్దడి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడుచింతపల్లి కేశవాపూర్‌లో 5.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే పనులు వేగవంతమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని ఈ రిజర్వాయర్‌కు తీసుకొచ్చేందుకు పనులు చకచకా సాగుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణం కోసం జలమండలి అధికారులు భూసేకరణకు కేశవాపూర్ రైతులతో మాట్లాడారు. దీంతో సర్వే, రెవెన్యూ అధికారులు భూ సేకరణపై దృష్టి సారించారు. తాగునీటి అవసరాలకు రిజర్వాయర్ నిర్మాణానికి అటవీశాఖ నుంచి వేయి ఎకరాల సేకరణకు అనుమతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 267ఎకరాలు సేకరించేందుకు లావాణి భూముల రైతులతో జలమండలి, భూసేకరణ, రెవెన్యూ అధికారులు చర్చలు జరపగా తమ భూములను ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చారని భూ సేకరణ అధికారి లింగ్యా నాయక్ తెలిపారు. మరో 90ఎకరాల పట్టాభూములు సేకరించాల్సి ఉంది. దీనికోసం సర్వేలు చేస్తున్నారు. నెలరోజుల్లో రైతులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సిన భూమిని జలమండలికి అప్పగించేలా చర్యలు చేపట్టినట్లు భూసేకరణ అధికారి తెలిపారు.