‘అయ్యో’ష్!
ABN , First Publish Date - 2021-05-22T05:12:26+05:30 IST
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు

- అనంతగిరికి ఆయుష్ యోగం పట్టేనా...?
- ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు రూ. 6 కోట్లు మంజూరు
- పరిశోధనా కేంద్రానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
- నాలుగేళ్లవుతున్నా ముందుకు సాగని పనులు
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు వచ్చి నాలుగేళ్లు అయింది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ... ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి అనంతగిరిలో ఆయుష్ కేంద్రం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్): వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఆయుష్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యయోగం కల్పిస్తామన్న ప్రభుత్వం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అనంతగిరిలో ఆయుష్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చి అవసరమైన నిధులు మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా ఇంకా పనులు ముందుకు సాగడం లేదు. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా మారాయి. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలో విలువైన ఔషధ, వన మూలికల మొక్కలు న్నాయి. ప్రకృతి వైద్యంతోపాటు హెల్త్ టూరిజం అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంటుం దని భావించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఆయూష్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు రూ.6 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా ఆయుష్‌పై పరిశోధనలు చేసేందుకు పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక్కడ ప్రతిపాదించిన ఆయుష్ కేంద్రం ద్వారా ప్రజలకు ఆయుర్వేద, యోగ నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్యసేవలు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వీటికి సంబంధించిన చికిత్సలు అందించేందుకు 500 పడకలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే తొలి విడతగా ఇక్కడ 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ముందుకు సాగని పనులు
అనంతగిరిలోని ప్రభుత్వ క్షయ, ఛాతి వ్యాధుల ఆసుపత్రి భవనాల్లో ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయుష్ ఆసుపత్రులతో పాటు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఈ ఆసుపత్రికి సంబంఽధించిన భవన సముదాయాలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. శిథిలావస్థకు చేరిన ఈ ఆసుపత్రి భవన సముదాయాలకు ఆరేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లతో మరమ్మతులు చేపట్టింది. అనంతగిరిలో ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడమే కాకుండా అటవీ ప్రాంతంలో కొత్తగా పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు పెంచడం, హెర్బల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు కేటాయించిన భవనాలను రెండేళ్ల కిందట రాష్ట్ర ఆయుష్ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. ఆయుష్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు భవనాలు అందుబాటులో ఉన్నా.. చికిత్సకు, పరిశోధనా కేంద్రం ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సి ఉంది.
ఆయుష్‌తో అనంతగిరికి మరింత పేరు
కేంద్ర ప్రభుత్వం ఆయుష్ కేంద్రం మంజూరు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆ పనులు ముందుకు సాగకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయుష్ రాష్ట్ర అధికారులు ప్రకటించి రెండేళ్లు గడిచినా పురోగతి కనిపించడం లేదు. ఆయుష్ కేంద్రం ఏర్పాటైతే ఆరోగ్య పరంగా, పర్యాటక పరంగా అనంతగిరికి మరింత పేరొచ్చే అవకాశం ఉంది. ఇటీవల అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు ఔషధ మొక్కలు కూడా నాటారు. ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చొరవ చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
అనంతగిరికీ హవా.. లాకో మరీజోంకీ దవా
అనంతగిరిలో నిజాం ప్రభువు నిర్మించిన టీబీ హాస్పిటల్ ఎంతోమంది క్షయ వ్యాధిగ్రస్థులకు ప్రాణం పోసింది. నిజాం ప్రభుత్వం నిర్మించిన ఈ ఆసుపత్రి (శానిటోరియం) 1946 నుంచి ఇప్పటివరకు తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది క్షయ వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యం అందించింది. ‘అనంతగిరికీ హవా.. లాకో మరీజోంకీ దవా..’ అనే నానుడి గురించి ఆ నోటా, ఈ నోట తెలుసు కున్న నిజాం నవాబు.. 1928 ప్రాంతంలో కొంత కాలం గడిపేందుకు కుటుంబ సపరివారంగా ఇక్కడకు వచ్చి అటవీ ప్రాంతాన్నంతా కలియ తిరిగారు. వివిధ రోగాలను నయం చేసే వనమూలికలు ఇక్కడ ఉన్నాయని గుర్తించారు. అప్పట్లో క్షయవ్యాధి బారిన పడ్డసరైన చికిత్స అందక ఎంతోమంది మృత్యువాత పడగా, అలాంటి వారికి ఆరోగ్యవంతమైన గాలితోపాటు సరైన చికిత్స అందేందుకు వన మూలికల చెట్లు ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతమే క్షయ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించేందుకు సరైన స్థలమని నిజాం నవాబు గుర్తించారు. ఈ కొండల్లో 450 ఎకరాల్లో 160 ఎకరాల విస్తీర్ణంలో 1930లో హైదరాబాద్ దక్కన్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఉస్మానియా పేరుతో ఆసుపత్రి (ఉస్మానియా సాహేద్గా) సముదాయం నిర్మించారు. అంతర్గత రోడ్లు, పూలతోటలు ఏర్పాటు చేశారు. 1946లో ప్రారంభించిన ఈ క్షయ చికిత్సాలయం లక్షలాది మంది క్షయ వ్యాధిగ్రస్థులకు పునరుజ్జీవనం చేకూర్చింది. ఈ క్షయ ఆసుపత్రి 1946 నుంచి 1994 వరకు లక్షలాది మంది క్షయ వ్యాధిగ్రస్థులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దింది. 60 ఎకరాల్లో రోగుల వార్డులు, అడ్మినిస్ర్టేషన్ బ్లాక్, ల్యాబ్, ఎక్స్‌రే ప్లాంట్, ఆపరేషన్, థియేటర్ తదితర భవనాలు ఉండగా, మరో 60ఎకరాల్లో నర్సెస్ హాస్టల్, కిచెన్, మెడికల్ అధికారులు, సిబ్బంది నివాస గృహాలు ఉన్నాయి. ఏడు వార్డులు, పరిపాలనా భవనం ఉంది.