ఉపాధికి ఊతం

ABN , First Publish Date - 2021-08-11T04:10:34+05:30 IST

మహిళా గ్రూపు సభ్యులకు ఉపాధికల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మేడ్చల్‌ జిల్లాలో ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టి మహిళల ఆర్థికాభి వృద్ధికి తోడ్పాటునందిస్తోంది.

ఉపాధికి ఊతం
రాంపల్లిదయార్‌ గ్రామంలోఅంజమ్మ తయారు చేసిన శానిటరీ వస్తువుల విక్రయం

  •  మహిళా గ్రూపు సభ్యులకు ఆర్థిక తోడ్పాటు 
  • మేడ్చల్‌ జిల్లాలో గ్రామీణాభివృద్ధి ద్వారా ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌ 
  • బ్యాంకులు, స్త్రీనిధి రుణ సహకారంతో స్వయం ఉపాధి
  • చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు
  • నిత్యావసర వస్తువుల తయారీ, విక్రయాలు

మహిళా గ్రూపు సభ్యులకు ఉపాధికల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా  మేడ్చల్‌ జిల్లాలో ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టి మహిళల ఆర్థికాభి వృద్ధికి తోడ్పాటునందిస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా గ్రూపుల్లోని మహిళలు వివిధ రకాల ఆహారపదార్ధాలతో పాటు నిత్యావసర వస్తువులను తయారు చేస్తూ వాటిని విక్రయించి ఆర్థికంగా రాణిస్తున్నారు. 

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి) 

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.  నూతన ఉత్పత్తులు, నిత్యం వినియోగించే సరుకుల తయారీ రంగంలో తమదైనముద్ర వేసుకుంటున్నారు. స్వయంసహాయక సంఘాల్లో మహిళలు ఉత్పత్తి రంగం వైపు అడుగులు కదుపుతున్నారు. నిత్యావసర వస్తువుల తయారీని ప్రోత్సహించడానికి మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోడీఆర్‌డీఏ కొత్తగా రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. వివిధ మహిళా గ్రూపుల్లోని సభ్యులను గుర్తించి జిల్లాలో 650 యూనిట్ల ద్వారా వివిధరకాల ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. సంఘాల్లోని మహిళలు స్వతహాగా ఉపాధి పొందేలా చర్యలు చేపట్టారు. 650 యూనిట్లలో ఇప్పటికే 400 యూనిట్లను ప్రారంభించారు. బ్యాంకులు, స్త్రీనిధి, గ్రామ సమాఖ్య, స్వయంసహాయక సంఘం, మండల సమాఖ్యల నుంచి రుణాలను అందించి మహిళల ఆర్థికాభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నారు. 

తయారీ వస్తువులు.. 

వంటింట్లో నిత్యం వినియోగించే కారంపొడి, పసుపు, దనియాలపొడి తదితర వస్తువులతో పాటు శనగ, బియ్యం, రాగి, జొన్న తదితర పిండితో వంటకాల తయారు. నిత్యం స్నాక్స్‌గా తినే బిస్కెట్లు, సకినాలు, మురుకులు, కారబూంది, చికెన్‌పకోడి, చికెన్‌ పచ్చడి, లడ్డూలు తదితర ఆహార పదార్ధాలు తయారు చేస్తూ సొంతంగా అమ్మకాలు చేపడుతున్నారు. అంతేకాకుండా శిక్షణ పొందిన మహిళలు పిండిగిర్ని, పచ్చళ్ల తయారీ, పెపర్‌ప్లెట్స్‌, నూనెగానుగలు, క్లీనింగ్‌ లిక్విడ్‌  మిషిన్లను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా  తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు.  

స్టాల్స్‌, దుకాణాల ద్వారా విక్రయాలు

మహిళలు గ్రామాల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేసుకుని వారు తయారు చేసిన వస్తువులను నేరుగా విక్రయిస్తున్నారు. తయారు చేసిన వస్తువులకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. 

ప్రతి రోజూ అమ్మకాలు జరుపుతున్నాం:  లావణ్య, అవుశాపూర్‌, పుడ్‌గ్రేయిన్‌ తయారీ యూనిట్‌ 

తయారు చేసిన  తినుబండరాలతో పాటు పలు రకాల వస్తువులను అన్ని మార్కెట్లలో అమ్మకాలు జరుపుతున్నాం. రూ.3 లక్షల పెట్టుబడి పెట్టా. ప్రభుత్వం రూ.2 లక్షల రుణం ఇచ్చింది. మేడ్చల్‌ కలెక్టరేట్‌ వద్ద షాపు ఏర్పాటు  చేశాం. మంచి లాభాలు వస్తున్నాయి. ఆరునెలలుగా చేతినిండా పని దొరికింది.

అమ్మకాలు పెరిగాయి: మూగ అంజమ్మ, రాంపల్లి 

శానిటరీ వస్తువుల తయారీకి శిక్షణ తీసుకొని తయారు చేస్తున్నాను. అమ్మకాలు పెరిగాయి. మంచి లాభాలు వస్తున్నాయి. సంఘం సభ్యుల సహకారం, అధికారుల ప్రోత్సాహంతో వ్యాపారాన్ని విస్తరించాను. ఆంధ్రప్రదేశ్‌లోనూ బ్రాంచ్‌ని ఏర్పాటు చేశా.

మహిళల అర్థికాభివృద్ధే లక్ష్యం: పద్మజారాణి, పీడీ డీఆర్డీఏ, మేడ్చల్‌జిల్లా

 ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంటర్‌ ప్రైజెస్‌ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. బ్యాంకుల  నుంచి స్త్రీనిధి రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. చాలా మంది మహిళలు వారు తయారు చేసిన వస్తువులను విక్రయిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. 

Updated Date - 2021-08-11T04:10:34+05:30 IST