సాదాబైనామాలకు మోక్షం ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-08-25T06:26:19+05:30 IST

సాదాబైనామాలకు మోక్షం ఎప్పుడు లభిస్తుం దోనని? జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. గతంలో భూముల క్రయ విక్రయాలన్నీ తెల్లకాగితాలపైనే జరిగేది. కేవలం ప్రజల నమ్మకాల పైనే సాదాబైనామాల ద్వారా స్తిరాస్థులు కొనుగోలు చేస్తూ అమ్ముకునే వారు. ప్రస్తుతం భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. వివాదాలు పెరుగు తున్నాయి. అమ్మకందారులు,

సాదాబైనామాలకు మోక్షం ఎప్పుడు?

పెండి ంగ్‌లోనే ఉన్న దరఖాస్తులు

ఏడాది గడిచినా లభించని స్పష్టత

రైతులు, గ్రామస్థుల ఎదురుచూపులు

జిల్లావ్యాప్తంగా అందిన దరఖాస్తులు 12,800

కామారెడ్డి, ఆగస్టు 24: సాదాబైనామాలకు మోక్షం ఎప్పుడు లభిస్తుం దోనని? జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. గతంలో భూముల క్రయ విక్రయాలన్నీ తెల్లకాగితాలపైనే జరిగేది. కేవలం ప్రజల నమ్మకాల పైనే సాదాబైనామాల ద్వారా స్తిరాస్థులు కొనుగోలు చేస్తూ అమ్ముకునే వారు. ప్రస్తుతం భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. వివాదాలు పెరుగు తున్నాయి. అమ్మకందారులు, కొనుగోలు దారులు నిత్యం పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం సాధారణం అయిపోయింది. ఇటీవల భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిం చడంతో పట్టాదారులు, మోకా పై ఉన్న వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపుతూ రాష్ట్ర ప్రభు త్వం 2016లో ఓ అవ కాశం కల్పిస్తూ సాదా బైనామాల ద్వారా క్రయ విక్రయాలు జరిపిన వారు దరఖాస్తు చేసు కోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే, తెల్లకాగితాలు, బాండు పేపర్లపై రాసుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటామని కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ క్రమంలోనే స్థిరాస్తుల క్రయ, విక్రయదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇలా ఇప్పటి  వరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 12,800 దరఖాస్తులు అందాయి. కాగా, ఆ దరఖాస్తులపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో సాదాబైనామాలపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. 

22 మండలాలు.. 12,800 దరఖాస్తులు

సాదాబైనామాల కోసం జిల్లాలోని 22  మండలాల పరిధిలోని గ్రామా ల్లో మీ సేవా కేంద్రాల ద్వారా సాదాబైనామాలపై దరఖాస్తులు స్వీకరిం చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో మొత్తం 12,800  మంది సాదాబైనామాలు క్రమబద్ధీకరించాలంటూ దరఖాస్తు చేశారు. ఇం దులో అత్యధికంగా మద్నూర్‌ మండలం నుంచి దరఖాస్తులు రాగా, రామారెడ్డి నుంచి అతితక్కువ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

ఇప్పటికీ తెరుచుకోని వెబ్‌సైట్‌

సాదాబైనామాల ద్వారా స్థిరాస్తులు కొనుగోలు చేసిన వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ నేటికీ తెరుచుకోవడం లేదు. ఆన్‌లైన్‌లో మాత్రం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారనే సంఖ్య దర్శనమిస్తోంది. అంతే తప్ప ఎవరెవరు దరఖాస్తు చేశారని సమాచారం తమకు కనిపించడం లేదని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. 

పట్టాదారులకే రైతుబంధు!!

సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసి స్థిరాస్తి అనుభవిస్తున్న, రికార్డులో పట్టాదారు పేరు మాత్రమే ఉంటుంది. దీంతో రైతుబంధు పథకం, రుణమాపీ పథకం, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అన్నీ పట్టా దారులకే వర్తిస్తున్నాయి. అంతేకాకుండా అనుభవదారుకు సంబంధించిన పాసు బుక్కు సైతం లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. అంతేకాకుండా సబంధిత పట్టాదారులే పట్టా పాసు బుక్కుల ఆధారంగా రుణాలు పొందుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సైతం అనుభవిస్తున్నారు. దశాబ్దాల క్రితం స్థిరాస్తులు కొనుగోలు చేసినా.. తమ పేరిట లేకపోవడంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తరచూ గొడవలకు బలవుతున్నారు. పట్టాదారు పాసుపుస్తకం లేక రైతులు శ్రమకోర్చి పండించిన పంటల దిగుబడులను ఐకేపీ కేంద్రాల్లోను విక్రయించే వీలు లేకుండాపోతోంది. ఇలాంటి రైతులు చేసేది ఏమీలేక తక్కువ ధరకైనా దళారులకు విక్రయిస్తూ నష్టాల పాలవుతున్నారు. 

దరఖాస్తు చేసి యేడాది అవుతోంది

: నర్సింలు, అడ్లూర్‌, కామారెడ్డి మండలం

నాలుగు సంవత్సరాల క్రితం సాదాబైనామా మీద ఎకరం 12 గుంటల భూమిని కొనుగోలు చేశాను. అయితే ప్రభుత్వం సాదాబైనామాల దరఖాస్తు చేసుకుంటే పాసుపుస్తకం ఇస్తామని చెబితే దరఖాస్తు చేసుకొని ఏడాది అవుతోంది. పాసుపుస్తకం ఇప్పటికీ రాలేదు. వెంటనే పాసుపుస్తకం ఇప్పించాలి. 

వెంటనే పాసు పుస్తకాలు ఇవ్వాలి

: నర్సింహారెడ్డి, తాడ్వాయి

ప్రభుత్వం సాదాబైనామాల కోసం దరఖాస్తులు స్వీకరించడం మంచి పరిణామమే. కానీ ఈ దరఖాస్తులు తీసుకొని సంవత్సర కాలం అవుతోంది. వెంటనే పాసు పుస్తకాలను ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే సాదాబైనామా దరఖాస్తుదారులకు కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలి. 

సాదాబైనామాల సమస్యలను పరిష్కరిస్తాం

: శరత్‌, కలెక్టర్‌, కామారెడ్డి

సాదాబైనామాల అంశం కోర్టు పరిధిలో ఉంది. అందుకే పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. కాగా, కోర్టు తీర్పు వచ్చాక ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సాదాబైనామాల దరఖాస్తులు పరిష్కారిస్తాం. దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

Updated Date - 2021-08-25T06:26:19+05:30 IST