రైతుల సమస్యను పరిష్కరిస్తాం
ABN , First Publish Date - 2021-08-25T05:54:55+05:30 IST
మండలంలోని పలు పట్టా భూములు సీలింగ్ భూములుగా చూయిస్తుండడంతో ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు.

కోటగిరి, ఆగస్టు 24: మండలంలోని పలు పట్టా భూములు సీలింగ్ భూములుగా చూయిస్తుండడంతో ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. కోటగిరి మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఎత్తొండలో 14 మంది, పొతంగల్‌లో ముగ్గురు, ఎక్లాస్‌పూర్ గ్రామంలో ఒకరికి పట్టా భూములు ఉన్నప్పటికీ అవి ఆన్‌లైన్‌లో సీలింగ్ భూములుగా చూయించడంతో సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై మంగళవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి భూములను పరిశీలించారు. ఎత్తొండలో 599 సర్వే నెంబర్‌లో 22 ఎకరాలకు గాను 9 ఎకరాలు సీలింగ్ ఉండగా మొత్తం సర్వే నెంబర్ సీలింగ్ చూయించడంతో ఆయా రైతులకు రిజిస్ర్టేషన్‌లు కావడం లేదన్నారు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలోనూ పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ శేఖర్, ఆర్‌ఐ సురేందర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.