బదిలీ టెన్షన్‌

ABN , First Publish Date - 2021-12-26T04:58:41+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బదిలీలు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలో టెన్షన్‌ మరింత పెరుగుతోంది.

బదిలీ టెన్షన్‌

- బదిలీల ధ్యాసలోనే జూనియర్లు

- ఉపాధ్యాయుల్లో నిరాశ

- ఒత్తిడిలో ఉద్యోగులు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు


కామారెడ్డి, డిసెంబరు 25: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బదిలీలు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలో టెన్షన్‌ మరింత పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఉపాధ్యాయులకు వారు ఏ జిల్లాకు వెళ్లాలో మెసేజ్‌ల రూపంలో ఆర్డర్స్‌ వచ్చేశాయి. మిగతా వాళ్లకూ వస్తూనే ఉన్నాయి. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల ప్రక్రియ కూడా దాదాపు కొలిక్కి వస్తోంది. ఇప్పటికే తాము ఎక్కడికి బదిలీ అయ్యామనే విషయం తెలిసిన వాళ్లలో కొంత అనుకూలంగా వచ్చిన వాళ్లు పర్వాలేదని ఫీల్‌ అవుతుండగా.. అనుకూలంగా రాని వారు మాత్రం డల్‌గా ఉంటున్నారు. ప్రధానంగా ఏ జిల్లాకు వెళితే అదే లోకల్‌ జిల్లాగా పరిగణిస్తారన్న విషయంలోనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

అవకతవకలు జరిగాయని ఆరోపణ

ఉపాఽధ్యాయ బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయని పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుకుంటున్నారు. తమకు అన్యాయం చేశారని, తుది జాబితా చూపకుండానే ట్రాన్స్‌ఫర్‌ జిల్లాలకు పంపించారని ఆరోపిస్తున్నారు. తమకంటే జూనియర్లను బదిలీ చేయకుండా తమను ట్రాన్స్‌ఫర్‌ చేశారని కొంతమంది సీనియర్లు వాపోతున్నారు. కొన్ని స్కూళ్లకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయించకుండా ఇష్టారీతిన ఉపాధ్యాయులను కేటాయించారని అంటున్నారు. కొన్ని సంఘాల నేతలు చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అధికారులను మచ్చిక చేసుకుని తమ సంఘంలో ఉన్నవారికి మంచి జరిగేలా చూస్తూ మిగిలిన వారికి అన్యాయం చేస్తున్నారని పేర్కొంటున్నారు.

ఆరోగ్య సమస్యలు

వారం నుంచి ట్రాన్స్‌ఫర్ల గురించే ఆలోచిస్తూ కొంత మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. వారం పది రోజుల నుంచి బీపీ, షుగర్లతో అత్యధికంగా బాధపడుతున్నావారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లపాటు ప్రశాంతంగా ఉన్నామని, ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియడం లేదు. కొంత మంది మాత్రం ఎక్కడిస్తే ఏమున్నది పోయి మన పని మనం చేసుకునుడే కదా అనే ధోరణిలో ఉంటున్నారు.

దూర ప్రాంతాలకు వెళితే ఇంట్లో వారి పరిస్థితి

ప్రస్తుతం కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో తాము మరో ప్రాంతానికి వెళితే వారి పరిస్థితి ఎలా అనే ఆలోచనలో పడుతున్నారు. తల్లిదండ్రులేమో ఉన్న ఊరిని, పంట పొలాలను వదిలిరామని చెబుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. వారిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్తే చూసుకునే వారు లేక వారి పరిస్థితి ఎంటని మనోవేదనకు గురవుతున్నారు. మరికొందరు పిల్లల చదువులు, తాము ఒకచోట ఉంటూ ఇంట్లో వారు మరోచోట ఉంటే ఎలా అని ఆలోచన చేస్తూ దిగులు చెందుతున్నారు. ఏది ఏమైనా బదిలీల ప్రక్కియ కొందరికి సంతోషాన్ని ఇస్తే, మరికొందరికి దుఃఖాన్ని ఇస్తున్నాయి.

Updated Date - 2021-12-26T04:58:41+05:30 IST