ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టత ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2021-12-31T07:16:12+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు స్పష్టత ఇవ్వాల్సిందేనని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా తో మాట్లాడారు.

ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టత ఇవ్వాల్సిందే

బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని రాష్ట్ర సర్కారు వెంటనే తెరిపించాలి 

ఎంపీ ధర్మపురి అర్వింద్‌

 నిజామాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు స్పష్టత ఇవ్వాల్సిందేనని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా తో మాట్లాడారు. వరిసాగు చేయవద్దన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు కావాల్సిన విత్తనాలను కూడా అందుబాటులో ఉంచలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇథనాల్‌కు భారీ డిమాండ్‌ ఉందన్నారు. జిల్లాలోని బోధన్‌ షుగర్‌ఫ్యాక్టరీ తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫ్యాక్టరీని నడిపిస్తే జిల్లాలోని వేలాది మంది రైతులు చెరకు సాగుచేస్తారన్నారు. ఇథనాల్‌ డిమాండ్‌ ఉండడం వల్ల ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు జిల్లాలో ఫ్యాక్టరీలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నా ప్రభుత్వ నిర్ణయం వల్ల వెనక్కిపోతున్నారన్నారు. బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీతో పాటు ఇతర జిల్లాలోని చక్కెర కర్మాగారాలను తెరుస్తారా లేదా అని విషయాన్ని సంక్రాంతిలోపు స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే సంక్రాంతి తర్వాత పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. బాయిల్‌ రైస్‌ ఇవ్వబోమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చి ఇప్పుడు మంత్రులు అర్థంలేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని అవలంబిస్తుందన్నారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఎంత ధాన్యంపండించిన కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించి ఇప్పుడు వెనకడుగు వేయడమేంటని ఆయన ప్రశ్నించారు. యాసంగిలో ధాన్యం పండించే రైతులకు ఇతర రాష్ట్రాల వారీగా ఇన్సెంటీవ్‌ ఇవ్వాలని ఆయన కోరారు. చెరకు పంటకు జిల్లాలో పూర్వవైభవం తీసుకువస్తామని ఆయన తెలిపారు. జిల్లా నుంచి ఆర్‌అండ్‌బి మంత్రిగా ప్రశాంత్‌రెడ్డి ఉన్నా.. మాధవనగర్‌ ఆర్‌వోబీని పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. పాతబస్తీలోని బ్రిడ్జికి 80 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి జిల్లాకు మాత్రం నిధులు మంజూరు చేయడంలేదన్నారు. నిర్మాణాన్ని చేపట్టడంలేదని ఆయన విమర్శించారు. జిల్లాలోని అర్సపల్లి, బోధన్‌లోని బ్రిడ్జిలను కూడా పట్టించుకోవడంలేదని విమర్శించారు. తన తండ్రి డీఎస్‌ బీజేపీలోకి వస్తే సంతోషమేనని ఆయన అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్న నాకు ఆశీర్వాదం ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో రూ.200 కోట్లకు పైగా అప్పులయ్యాయని ఎంపీ ఆరోపించారు. బ్యాంకు 30 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్న బ్యాంకు ఎందుకు అప్పులభారిన పడిందో చైర్మన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పార్టీ ఆధ్వర్యంలో బ్యాంక్‌ అవకతవకలపైన బాన్సువాడ నుంచి ఆందోళన మొదలుపెడతామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల చిట్‌చాట్‌లో జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నియోజకవర్గ ఇంచార్జ్‌లు డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతిరెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

 బీజేపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బెదిరింపులు..

ఆర్మూర్‌టౌన్‌: సోషల్‌ మీడియాలో టీఆర్‌ఎస్‌ను, టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నిస్తూ పోస్టు చేస్తున్న బీజేపీ కార్యకర్తలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వాట్సఫ్‌ ఫోన్‌ చేసి బెది రింపులు పాల్పడుతున్నాడని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పట్టణంలో విశాఖకాలనీలో ఎంపీ నివాసంలో ఆర్మూర్‌ నియోజకవర్గ బీజేపీ ముఖ్యనాయకులతో గురు వారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు అంశాలపై బీజేపీ నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీనర్సయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీ వినయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శులు పుప్పాల శివరాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T07:16:12+05:30 IST