మొదటి విడత రూ.9 కోట్ల 40 లక్షలు
ABN , First Publish Date - 2021-11-21T07:10:23+05:30 IST
జిల్లాలో మొత్తం 102 మద్యం దుకాణాలకు గాను శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించి టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు.

ముగిసిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ
లక్కీ డ్రా తీసి దుకాణాలను కేటాయించిన కలెక్టర్
99 దుకాణాలకు డ్రా.. మరో మూడింటికి వాయిదా
డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు
సుభాష్‌నగర్, నవంబరు 20: జిల్లాలో మొత్తం 102 మద్యం దుకాణాలకు గాను శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించి టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు 1672 దరఖాస్తులకు రూ.33 కోట్ల 40 లక్షలు రాగా.. డ్రా పద్ధతిలో దుకాణాలను దక్కించుకున్న వారి నుంచి మొదటి విడతగా ప్రభుత్వానికి రూ.9కోట్ల40 లక్షల ఆదాయం సమకూరింది. నూతన మద్యం పాలసీలో సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో లిక్కర్ వ్యాపారులు ఎక్కువగా దరఖాస్తులు చేసేందుకు ఆసక్తి చూపించారు. 1672 దరఖాస్తుల్లో 99 మందికి అదృష్టం వరించింది. మిగతా వారు నిరాశగా వెనుదిరిగారు. మద్యం దుకాణాలకు లక్కీ డ్రా పద్ధతిన విజేతలను నిర్ణయించగా అందులో ఆరుగురు మహిళలకు అదృష్టం వరించింది. మొత్తానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మద్యం టెండర్ల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగియడంతో ఎక్సైజ్ శాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా లో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్, మో ర్తాడ్ డివిజన్‌ల వారీగా లక్కీ డ్రా నిర్వహించారు. అత్యధికంగా ఏర్గట్ల మండల దుకాణానికి 74 దరఖాస్తులు నమోదుకాగా డ్రాలో 4వ నెంబర్ కాటిపల్లి శివచరణ్‌రెడ్డిని వరించింది. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని 25వ షాప్ మానిక్‌భండార్ దుకాణానికి 69 దరఖాస్తులు రాగా డ్రా పద్ధతిలో 29వ నెంబర్ వసంత్‌రావుకు వరించింది. కాగా, ఈ నెల 30తో పాత మద్యం పాలసీ ముగియనుండగా డిసెంబరు 1 నుంచి కొత్త పాలసీ అమలు కానుంది.
ఫ డ్రా తీసిన కలెక్టర్ నారాయణరెడ్డి..
మద్యం దుకాణాలకు కలెక్టర్ నారాయణరెడ్డి లక్కీ డ్రా పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేశారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉదయం 11గంటలకు మొదలైన డ్రా 3 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ లక్కీ డ్రా చాలా పారదర్శకంగా నిర్వహించామని 99షాప్‌లకుగాను మద్యం షాప్‌లను కేటాయించామని 3 షాప్‌లకు దరఖాస్తులు రాని కారణంగా వాయిదా వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి నవీన్‌చంద్ర, డీసీపీ అర్వింద్‌బాబు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ నందగోపాల్, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ మూడు మద్యం దుకాణాలకు డ్రా వాయిదా..
జిల్లాలోని మూడు మద్యం దుకాణాలకు దరఖాస్తులు అత్యల్పంగా నమోదు కావడం వల్ల వాయిదా వేశారు. 8, 36, 99 నెంబర్‌ల గల మద్యం దుకాణాలకు డ్రా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదాపడ్డ మద్యం దుకాణాల కేటాయింపుపై అధికారుల నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.
ఫ ఆరుగురు మహిళలకు దక్కిన దుకాణాలు..
99 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా పద్ధతిన విజేతలను నిర్ణయించగా అందులో ఆరు గురు మహిళలకు అదృ ష్టం వరించింది. నిజామాబాద్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మహిళలు మద్యం దుకాణాలు దక్కించుకోగా ఆర్మూర్ స్టేషన్ పరిధిలో ఒకరు, బోధన్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలకు మద్యం దుకాణాలు దక్కాయి. మహిళలతో అదృష్టం వస్తుందని భారీగా దరఖాస్తులు నమోదు చేసిన వీరిలో ఆరుగురికి మాత్రమే అదృష్టం వరించింది.
ఫ బడా వ్యాపారుల వల..
గుడ్‌విల్ పేరిట బడా వ్యాపారులు వల వేస్తున్నారు. మద్యం దుకాణాలు దక్కని కొందరు బడా వ్యాపారులు లక్కీ డ్రాలో షాప్‌లు దక్కినవారికి గుడ్‌విల్ పేరుతో వల వేస్తున్నారు. వారిని నేరుగాని మధ్యవర్తుల ద్వారా గాని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు.